Features.. Controversies విశేషాలు.. వివాదాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:15 AM
Features.. Controversies 2025 మరో రెండు రోజుల్లో ముగిసిపోనుంది. ఈ ఏడాదిలో జిల్లాలో చాలా ముఖ్యమైన ఘటనలు జరిగాయి. జిల్లా రథసారథులుగా ఉన్న కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ ఏడాది సెప్టెంబరులోనే బాధ్యతలు చేపట్టారు. ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నారు.
విశేషాలు.. వివాదాలు
2025లో కీలక ఘటనలు
పేలుళ్లకు కుట్ర వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
కలెక్టర్, ఎస్పీ బాధ్యతల స్వీకారం
2025 మరో రెండు రోజుల్లో ముగిసిపోనుంది. ఈ ఏడాదిలో జిల్లాలో చాలా ముఖ్యమైన ఘటనలు జరిగాయి. జిల్లా రథసారథులుగా ఉన్న కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ ఏడాది సెప్టెంబరులోనే బాధ్యతలు చేపట్టారు. ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ముఖ్య సంఘటనల్లో గుర్తించుకోదగినవే కాకుండా ప్రగతి పథంలో నడిచేందుకు దోహదపడేవి, స్ఫూర్తినిచ్చేవి, మార్గనిర్దేశం ఇచ్చేవి, అప్రమత్తం చేసేవి కూడా ఉన్నాయి. అవేంటో సంక్షిప్తంగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
విజయనగరం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
2025 ఏడాది జిల్లా ప్రజలకు కొన్ని మరచిపోలేని తీపి గురుతులు ఇచ్చింది. అలాగే కొన్ని విషాదాలు, వివాదాలను కూడా మిగిల్చింది. ఒకసారి వాటన్నింటినీ మననం చేసుకుందాం. అక్టోబరు 1న సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ప్రతినెలా సామాజిక పింఛన్ల పంపిణీకి ఏదో జిల్లాకు వెళుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్టోబరు నెలలో విజయనగరం జిల్లాకు విచ్చేశారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామస్థులతో ఉల్లాసంగా గడిపారు.
- సెప్టెంబరులో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గుర్ల మండలంలో తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. పెండింగ్ పనులతో పాటు నిధుల అవసరంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రామతీర్థసాగర్ పూర్తయితే భోగాపురం ఎయిర్‌పోర్టుతో పాటు విజయనగరం, నెల్లిమర్ల తదితర ప్రాంతాలకు పుస్కలంగా తాగునీరు అందుతుంది.
- జిల్లా రథసారథి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సెప్టెంబరు 13న బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి రెవెన్యూపరంగా సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఉద్యాన పంటల సాగు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఎస్పీగా ఏఆర్ దామోదర్ సెప్టెంబరు 15న బాధ్యతలు చేపట్టారు. గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు.
- మార్చి 29న బొబ్బిలిలో వీణల తయారీ కళాకారుడు సూర్యప్రకాశరావుకు హంస ఉగాది పురస్కారం లభించింది. బొబ్బిలి వీణ తయారీ రంగానికి సంబంధించి వన్ డిస్ర్టిక్ట్ వన్ ప్రాడెక్టు కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో బొబ్బిలి వీణ తయారీదార్లకు మరింత గుర్తింపు ఇచ్చింది.
- నగరంలో పేలుళ్లకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరైన సిరాజ్ జిల్లా కేంద్రంలో ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలోని విజ్జీ స్టేడియంలో పటుకున్నారు. ఈయనతో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ను కూడా అక్కడ అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. అధికారులు ముందుగా గుర్తించకుంటే జిల్లా కేంద్రంలో పెను విధ్వంసం జరిగుండేది. ఆ ఇద్దరూ అరెస్ట్ కావటంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
- అక్టోబరు 5,6 తేదీల్లో భోగాపురం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డిసెంబరు 23న మరోసారి భోగాపురం కార్యాలయ ఉద్యోగులు, మరో ప్రైవేటు వ్యక్తి ఇంటిని సోదా చేశారు. ప్రైవేటు వ్యక్తికి చెందిన రూ.18.10 లక్షల నగదుతో పాటు బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
- అక్టోబరు 22న జిల్లాకు చెందిన మత్స్యకారులు తొమ్మిది మంది సంద్రంలో చేపల వేట సాగిస్తూ అనుకోకుండా బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కారు. తుఫాన్ కారణంగా రాడర్ వ్యవస్థ పనిచేయక బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోయారు. వారి రాక కోసం నేటికీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
- నవంబరు 6న జిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు తమిళనాడులో దుర్మరణం పాలయ్యారు. దత్తిరాజేరు మండలానికి చెందిన ముగ్గరు, గజపతినగరం మండలానికి చెందిన ఒకరు శబరిమలై అయ్యప్ప దర్శనం అనంతరం కారులో వస్తుండగా బడలికతో కారును రోడ్డుపక్కన ఆపి నిద్రించారు. అంతలోనే మరో కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో ఒకేసారి నలుగురు మృతిచెందారు.
- నవంబరు 21న అరసాడలో రూ.32 కోట్లతో బయోప్లాంట్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతో ఆయాగ్రామాల్లో అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలు కలగనున్నాయి.
- గుర్ల మండలంలో కొత్తగా నిర్మించనున్న స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా డిసెంబరు రెండోవారంలో నిరశన కార్యక్రమాలు జరిగాయి. నాలుగు గ్రామాల్లోని కొంతమంది ప్రజలు ఆందోళనకు దిగారు. కెల్ల సమీపంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయనుండడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంట పొలాలను నాశనం చేసే పరిశ్రమ తమకు వద్దంటూ స్పష్టంచేస్తున్నారు.
---------------