fear with arukalapeta villiagers ఎరు‘కలవరం’
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:22 PM
fear with arukalapeta villiagers పవర్ ప్లాంట్ లేదా సబ్‌స్టేషన్ కోసం తమ గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తారని జరుగుతున్న ప్రచారంతో దత్తిరాజేరు మండలం ఇంగినాపల్లి పంచాయతీ ఎరుకలపేట వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలగర్భంలో కలసిపోయిన గ్రామాల చరిత్రలో ఈ గ్రామాన్ని చేర్చే కుట్ర సాగుతోందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇదే విషయమై గొడవలు జరిగాయి. ఎన్నికలు సమీపించడంతో గత ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రతిపాదన రావడంతో వారంతా టెన్షన్ పడుతున్నారు.
ఎరు‘కలవరం’
- మళ్లీ తెరపైకి గ్రామ వివాదం
- పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ప్రచారం
- మొదలైన సర్వే ప్రక్రియ
- ఆందోళన చెందుతున్న ఎరుకలపేట వాసులు
- ఇటీవల కలెక్టరేట్ ముందు ఆందోళన
- ప్రభుత్వ భూమి ఉన్నా ఊరిపై పడడం పట్ల అనుమానాలు
పవర్ ప్లాంట్ లేదా సబ్‌స్టేషన్ కోసం తమ గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తారని జరుగుతున్న ప్రచారంతో దత్తిరాజేరు మండలం ఇంగినాపల్లి పంచాయతీ ఎరుకలపేట వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలగర్భంలో కలసిపోయిన గ్రామాల చరిత్రలో ఈ గ్రామాన్ని చేర్చే కుట్ర సాగుతోందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇదే విషయమై గొడవలు జరిగాయి. ఎన్నికలు సమీపించడంతో గత ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రతిపాదన రావడంతో వారంతా టెన్షన్ పడుతున్నారు.
మెంటాడ/ దత్తిరాజేరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి)
దత్తిరాజేరు మండలం ఇంగినాపల్లి పంచాయతీ ఎరుకలపేట లో మూడేళ్ల క్రితం అధికారులు గోప్యంగా సర్వే నిర్వహించారు. అది దేనికోసమో వెల్లడించనప్పటికీ ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి ఆ స్థలంలో పవర్‌ప్లాంట్ లేదా విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయ నున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో స్థానికంగా తీవ్ర అలజడి చెలరేగింది. అభివృద్ధి ముసుగులో గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నంపై ఎరుకలపేట వాసులు తిరుగుబాటు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్థానిక అధికారుల ద్వారా ఉన్నతాధికారులకు, వారి ద్వారా ప్రభుత్వానికి విషయం చేర డంతో కొన్నాళ్లపాటు మల్లగుల్లాలు పడిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఎన్నికల హడావుడి మొదలవడంతో రాజకీయ లబ్ధి కోసం స్థలసేకరణ ప్రక్రియను విరమించుకుంటున్నట్టు పార్టీ వర్గాల ద్వారా లీకు లు ఇచ్చింది. మొత్తమ్మీద తమ గ్రామం సురక్షతంగా ఉన్నందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ సబ్‌స్టేషన్ లేదా పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తారన్న ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
50 ఏళ్లుగా ఇక్కడే ఆవాసం..
ఎరుకలపేట గ్రామంలో ప్రస్తుతం 120 కుటుంబాల్లో 500 మంది ఉంటున్నారు. ఎరుకల వృత్తే జీవనాధారం. సుమారు ఐదు దశబ్దాల నుంచి ఇక్కడే జీవిస్తున్నారు. వీరి బాగోగులు పట్టించు కునే నాథుడే లేరు. కొందరు రెక్కల కష్టంతో పక్కా ఇళ్లు నిర్మించు కున్నారు. మిగిలిన వారికి పూరిపాకలే గతి. పవర్ ప్లాంటో... సబ్ స్టేషనో నిర్మించాలని అనుకుంటే కొండను ఆనుకొని ఉన్న సుమా రు 150 ఎకరాల రిజర్వ్ ప్రభుత్వ భూమి ఉంది. కానీ యాభై ఏళ్లుగా నివాసముంటూ ఈనేలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న 120 కుటుంబాలకు చెందిన 500 మందికి ఆశ్ర యమిస్తున్న ఎరుకలపేట గ్రామాన్ని ఎంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూముల్లో కొలతలు తీస్తున్నవారు ప్రభుత్వ ఉద్యోగులా, ప్రైవేట్ సిబ్బందా అనేది కూడా తెలియడం లేదని చెబుతున్నారు. ఇటీవల కలక్టరేట్ వద్ద గ్రామస్థులు ఆందోళన చేప ట్టారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. తరువాత పలు మార్లు మండల అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి తమ సమస్యను విన్నవించారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా దోబూచులాటను కట్టిపెట్టి దీనిపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి ఉద్యయం అసాధారణ స్థాయిలో ఉంటుందంటున్నారు.
ఊరిని వదిలేది లేదు..
ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎవరెవరో వచ్చి ఊరంతా కొలతలు తీసి వెళ్తున్నారు. అడిగితే చెప్పడం లేదు. మూడేళ్ల క్రితం ఇలాగే జరిగింది. గండం గడిచింది అనుకుంటే ముప్పు మళ్లీ వెంటాడుతోంది. ఊరిని నేలమట్టం చేస్తారని కొందరు అంటుంటే భయమేస్తోంది.ఊరిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు.
-పాలవలస బంగారి, ఎరుకల వారి పెద్ద మనిషి
ఇక్కడే పుట్టాం ఇక్కడే చస్తాం..
ఊరును ఖాళీ చేయించి ఏవేవో కడతారని వింటున్నాం.ఎక్కడికెళ్లాలి?ఎలా బతకాలి? మూడేళ్లుగా మాతో ఆడుకుంటున్నారు. ఇన్నేళ్లయినా ఊరి గురించి ఒక్కరూ పట్టించుకోలేదు. అయినా ఏనాడూ నోరు తెరవలేదు. ఇప్పుడు ఊరే లేకుండా చేస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చుంటామా. ఇక్కడే పుట్టాం ఇక్కడే చస్తాం.
-పాలవలస కృష్ణ, స్థానికుడు
తాడోపేడో తేల్చుకుంటాం..
ఎందుకు సర్వే చేస్తున్నారో చెప్పరు. ఏం చేయదలుచుకున్నారో చెప్పరు. పేదలను ఆందోళనకు గురిచేస్తున్నారు. చుట్టూ వందల ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఉండగా ఎరుకలపేట మాత్రమే వారికి కనబడిందా?వారి తరఫున సీపీఎం పోరాడుతుంది. తాడోపేడో తేల్చుకుంటాం.
-రాకోటి రాములు, సీపీఎం నాయకుడు