Share News

fear poor people for not get rationcard ఇంకెన్నాళ్లో!

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:53 PM

fear poor people for not get rationcard గత ఏడాది జనవరి నుంచి రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి కొత్తగా పెళ్లి అయిన జంటలన్నీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశాయి. ఇదే సమయంలో వారు ఇదివరకు ఉన్న కార్డుల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ఈ రెండూ జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు.

fear poor people for not get rationcard ఇంకెన్నాళ్లో!
గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన రేషన్‌కార్డులు (ఫైల్‌)

ఇంకెన్నాళ్లో!

కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాది జంటలు

చేర్పులు, మార్పుల కోసం మరింత మంది నిరీక్షణ

గత ఏడాది జనవరి నుంచి అయోమయమే

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏడాదిన్నరగా అనేక వినతులు

- గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన ఓ జంటకు వివాహమై ఏడాదిన్నర కావస్తోంది. కొత్త రేషన్‌ కార్డు కోసం గత ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. కార్డు మంజూరు చేసే సమయానికి ఎన్నికల కోడ్‌ రావడంతో మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొత్త రేషన్‌ కార్డు మంజూరు కాలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

- విజయనగరం పట్టణానికి చెందిన ఓ దంపతులు పుట్టిన బిడ్డ వివరాలను వారి రేషన్‌ కార్డులో చేర్పించడం కోసం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నారు. రేషన్‌ కార్డులో చేర్పులు, మార్పులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయంలో జనవరి నుంచి నిలిచిన ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు.

- గజపతినగరానికి చెందిన ఓ వ్యక్తి రేషన్‌ కార్డులో తన పేరు తప్పుందని స్థానిక గ్రామ సచివాలయం సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అనుమతి రాలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆయన కార్డులో చేర్పులు, మార్పులపై ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాడు.

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి):

కొత్త రేషన్‌ కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం స్థానిక అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రాలు ఇచ్చారు. దాదాపు ఏడాదిన్నర నుంచి నిరీక్షిస్తున్నారు.

గత ఏడాది జనవరి నుంచి రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి కొత్తగా పెళ్లి అయిన జంటలన్నీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశాయి. ఇదే సమయంలో వారు ఇదివరకు ఉన్న కార్డుల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ఈ రెండూ జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారు. రాయితీలను పొందలేకపోతున్నారు. ఇళ్లు, పింఛన్లు దక్కనివారెందరో. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో రైస్‌ కార్డులను తీసుకొచ్చింది. కొత్తగా కార్డులు కావాల్సిన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకునేవారు. మంజూరు ప్రక్రియ చాలా నెమ్మదిగా నడిచేది. గత ఏడాది జనవరి నెల వరకూ గ్రామ, వార్డు సచివాలయంలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గత ఏడాది జూన్‌లో కార్డులు మంజూరు కావాల్సి ఉంది. అయితే సాధారణ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది వరకూ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి నేటికీ కార్డు దక్కలేదు. ప్రభుత్వం మారాక కార్డుల మంజూరుకు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వేలాదిగా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చారు. వారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది చివరిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ జనవరి నుంచి రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చుని ప్రకటించారు. కాని ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాలేదు. దీంతో కార్డులపై ఆశపెట్టుకున్న వారు నిరాశ చెందారు. ప్రభుత్వం ఇటీవల స్పౌజ్‌ పింఛన్ల కోసం అనుమతి ఇచ్చింది. కొత్త రేషన్‌ కార్డుల కోసం కూడా అనుమతి ఇవ్వాలని అర్జీదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:53 PM