Father and son as co-teachers సహ ఉపాధ్యాయులుగా తండ్రీకొడుకు
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:07 AM
Father and son as co-teachers తండ్రీ కొడుకు ఇద్దరూ ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టును బోధించే ఉపాఽధ్యాయులుగా అవకాశం లభించిన అరుదైన ఘటన బొబ్బిలి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక పూల్‌బాగ్‌కు చెందిన బంకురు రాకేష్ ఇటీవల జరిగిన డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయునిగా ఎంపికై ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించారు.
సహ ఉపాధ్యాయులుగా తండ్రీకొడుకు
ఒకే పాఠశాలలో విధులు
ఇద్దరూ ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్లే
బొబ్బిలి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):
తండ్రీ కొడుకు ఇద్దరూ ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టును బోధించే ఉపాఽధ్యాయులుగా అవకాశం లభించిన అరుదైన ఘటన బొబ్బిలి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక పూల్‌బాగ్‌కు చెందిన బంకురు రాకేష్ ఇటీవల జరిగిన డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయునిగా ఎంపికై ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించారు. ఈయన బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి మున్సిపల్ హైస్కూలులో నియామకమయ్యారు. సోమవారం విధుల్లో చేరనున్నారు. అదే పాఠశాలలో తండ్రి రామకృష్ణ కూడా ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండడం విశేషం. ఇకపై తండ్రీకొడుకు ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టు టీచర్లుగా పనిచేయనున్నారు. అరుదుగా లభించిన ఈ అవకాశం పట్ల రాకేష్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏయూలో ఎంఏ లిటరేచర్ చేసి బీఈడీ చదివిన రాకేష్ మొదటి సారి డీఎస్సీ రాసి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకును సాధించారు.
చాలా సంతోషంగా ఉంది: రాకేష్
మా నాన్న పనిచేస్తున్న పాఠశాలలోనే నాకు ఉపాధ్యాయునిగా అవకాశం లభించడం భగవంతుని వరప్రసాదంగా భావిస్తున్నాను. ఉన్న ఊర్లో, అందులోనూ తండ్రి పనిచేసే చోటే ఉద్యోగం దక్కడం చాలా సంతోషంగా ఉంది. నేను రోజూ మా నాన్నను స్కూలుకు బైకుపై డ్రాప్ చేసేవాడిని. ఇకపై ఇద్దరం కలిసి విధులకు వెళ్లవచ్చు. మా తండ్రి అడుగుజాడల్లో, సహచర సీనియర్ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో నా విధులను త్రికరణశుద్ఢిగా నిర్వహిస్తాను. మంచి ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందేందుకు శ్రమిస్తాను.