ఫాస్ట్‌ఫుడ్స్.. ఆరోగ్యం మటాష్
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:37 PM
జిల్లాలో దుకాణాలు, హోటళ్లు, రోడ్డుపక్కన తోపుడుబండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
- పుట్టగొడుగుల్లా వెలుస్తున్న సెంటర్లు
- ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలకు తూట్లు
- నిద్ధరోడుతున్న ఆహార కల్తీ శాఖ
- జిల్లాలో ఇద్దరే ఇన్‌స్పెక్టర్లు
రాజాం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దుకాణాలు, హోటళ్లు, రోడ్డుపక్కన తోపుడుబండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కర్రీ పాయింట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ, ఇందులో కొన్నింటికే అనుమతులు ఉన్నాయి. ఆహార తయారీలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. రోడ్డు పక్కనే, మురుగు కాలువల చెంతనే ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్లను విక్రయిస్తున్నారు. బిర్యాని, ఫైడ్‌రైస్, చికెన్ పకోడి, కబాబులు, న్యూడిల్స్‌ను తయారు చేస్తున్నారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు. రుచి, వాసన పెరిగేందుకు రకరకాల వస్తువులను వినియోగిస్తున్నారు. వీటిని తింటున్న ప్రజలు లివర్, శ్వాససంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. నియంత్రించాల్సిన ఆహార భద్రతా అధికారులు, మునిసిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పత్తా లేకుండా పోతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 3 వేల వరకూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అనుమతి ఉన్నవి కొన్నే. లైసెన్స్‌డ్ దుకాణాలు 1200, రిజిస్ర్టేషన్ అయినవి ఓ 1100 వరకూ ఉన్నాయి. ఎక్కువ వాటికి ఎటువంటి అనుమతులు లేవు. వాస్తవానికి వీటికి లైసెన్స్ తప్పనిసరి. ఆహార పదార్థాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ మార్కుతో పాటు నాణ్యతా ప్రమాణాలు, ధర ముద్రించి విక్రయించాలి. కానీ, ఈ విషయం చాలామందికి తెలియదు. వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో సమాచారం తెలుసుకోవచ్చు. జిల్లా ఆహార నియంత్రణ సహాయ అధికారి కార్యాలయానికి నిర్దేశించిన రుసుంతో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అర్హతలు పరిశీలించిన తరువాత వీరికి లైసెన్స్ మంజూరు చేస్తారు. ఆహారం తయారు చేసేవారికి (కుక్)లకు కొన్ని ఆహార ప్రమాణంపై అవగాహన అవసరం. కానీ, చాలామంది వృత్తిగా ఎంచుకున్న వారు కొద్దిరోజుల పాటు హోటళ్లలో పనిచేసి తరువాత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి వారిపై నిఘా పెంచడంతో పాటు ఆహార తయారీపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. కర్రీ పాయింట్ల గురించి చెప్పనక్కర్లేదు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు అన్ని ముఖ్య పట్టణాల్లో కర్రీ పాయింట్లు ఏర్పాటుచేసి సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థుల అవసరాలను టార్గెట్ చేసుకొని నాణ్యత లేని కూరలు, పప్పుతో పాటు ఇతర ఆహార పదార్థాలను అమ్ముతున్నారు.
సరిపడినంత సిబ్బంది లేరు
ఆహార కల్తీ నియంత్రణ శాఖలో తగినంతమంది సిబ్బంది లేరు. ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు చొప్పున ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరైనా సెలవుపెట్టినా, ఇతర పనుల మీద బయటకు వెళ్లినా శాఖపరంగా కార్యకలాపాలు స్తంభిస్తాయి. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ లక్ష మంది జనాభాకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి ఒక ఆహార భద్రతా అధికారి ఉండాలి. ఈ లెక్కన ఒక్క జిల్లా కేంద్రంలోనే ఆరుగురు ఉండాలి. రాజాం, బొబ్బిలి మునిసిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో కనీసం ఇద్దరు చొప్పున ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో కేవలం ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. సూపరింటెండెంట్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు సైతం ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. అధికారులు ఆకస్మిక దాడులు, తనిఖీలకు వెళ్లాలంటే సొంత వాహనాలు లేవు. ఆహార కల్తీ నియంత్రణలో అతి ప్రధానమైన విధి ఆహార పదార్థాలు, పానియాల నమూనాల సేకరణ. ఎప్పటికపడు వాటిని ల్యాబ్‌లకు పంపించి తనిఖీ చేయాలి. కానీ ఆ పని జిల్లాలో సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రజారోగ్యానికి తీరని భంగం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది.
తనిఖీలు చేస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, ఫాస్టుఫుడ్ సెంటర్లను తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాలు సీజ్ చేసేందుకు సైతం వెనుకడుగు వేయడం లేదు. ఆహార కల్తీ నియంత్రణ శాఖలో సిబ్బంది కొరత వాస్తవమే. అయినా సరే ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఎక్కడైనా నిబంధనలు అతిక్రయించినా, ఆహారాన్ని కల్తీ చేసినా 94908 86669, 87907 00304 నెంబర్లను సంప్రదించాలి.
- ఈశ్వరి, ఆహార కల్తీ నియంత్రణ ఇన్‌స్పెక్టర్, విజయనగరం