Share News

Farmers రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:36 AM

Farmers’ Welfare Is the Prime Goal రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం పాచిపెంట మార్కెట్‌ యార్డులో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌’ కార్యక్రమం నిర్వహించారు.

Farmers  రైతుల సంక్షేమమే ధ్యేయం
రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కును అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి

పాచిపెంట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం పాచిపెంట మార్కెట్‌ యార్డులో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు చెక్కులు అందజేశారు. అన్నదాత వ్యవసాయ మదుపుల కోసం ప్రభుత్వం ఏటా రూ. 20 వేలు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 2న రూ. 7వేలు, ఇప్పుడు రెండో విడతగా మరో రూ. 7 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల చొప్పున మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలకు జమవుతుం దన్నారు. మరో మూడు నెలల్లో మూడో విడతగా రూ. 6 వేలు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,22,260 మంది రైతులకు రూ. 83.32 కోట్లు అందించినట్లు వెల్లడించారు. సాలూరు నియోజకవర్గంలో 31,531 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 21.37 కోట్లు జమైనట్లు వివరించారు. అన్నదాతల ఆర్థికాభివృద్ధికి సీఎం చంద్రబాబు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

రైతుల కుటుంబాల్లో ఆనందం: కలెక్టర్‌

అనంతరం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అకౌంట్లలో నిధులు జమ కావడంతో వారి కుటుంబాలలో ఆనందం కనిపిస్తుందన్నారు. మన్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దళారుల మాటలు విని మోసపోవద్దన్నారు. ప్రతి రైతు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి గిట్టుబాటు ధరను పొందాలని సూచించారు. ఒకే పంటను వేయడం వల్ల నష్టాలు తప్పవన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని సాగు చేపట్టాలని తెలిపారు. నానో యూరియా, డీఏపీల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, జిల్లా వ్యవసాయాధికారి అన్నపూర్ణ, సాలూరు ఏఎంసీ చైర్మన్‌ సూర్యనా రాయణ, ఎంపీపీ బి.ప్రమీల, నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:36 AM