రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:51 PM
రైతులు ఇకనుంచి రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి సూచించారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
మక్కువ రూరల్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రైతులు ఇకనుంచి రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మండలంలోని వెంకటభైరిపురంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడులు, విత్తనాలు, ఎరువులు ఏవిధంగా అందుబాటులో ఉన్నాయో వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులు, రైతు సేవాకేంద్రాల సిబ్బంది అన్నివేళలా రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చే కూరగాయల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వెంకటభైరిపురం ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ఓపీ, మందుల రిజిస్టర్లను పరిశీలించారు. దోమకాటుతో సోకే మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ప్రచారం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరుపై కలెక్టర్ మరోసారి ఆరాతీశారు. గర్భిణులు, చిన్నపిల్లల ఆరోగ్యరక్షణపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, వారికి అవసరమైన అన్నిరకాల టీకాలు, పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు కె.రాబర్టుపాల్, కె.సత్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయాధికారి చింతల భారతి, సిబ్బంది పాల్గొన్నారు.