రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:23 AM
రైతు పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
- ఎమ్మెల్యే విజయచంద్ర
- పార్వతీపురంలో ట్రాక్టర్లతో ర్యాలీ
పార్వతీపురం/రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రైతు పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో బుధవారం పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో రైతులు సుమారు 120 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సిపురం గ్రామం నుంచి ఏఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ విజయోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20వేలు ఆర్థికసాయం అందిస్తున్న ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందని అన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు నర్సిపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.