Farmers in sad situation రైతులో గుబులు
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:21 AM
Farmers in sad situation
రైతులో గుబులు
తుఫాన్ ప్రభావంతో నేలకొరుగుతున్న వరి పంట
నష్ట నివారణ తగ్గించేందుకు కదిలిన యంత్రాంగం
శృంగవరపుకోట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):
- వేపాడ మండలం పాటూరు గ్రామ పరిధిలో నెలకొరిగిన పంట ఇది. కొద్ది కొద్దిగా పొలంలోని పంటంతా కిందకు వాలిపోతోంది. వరి కంకులను నిలబెట్టాలంటే వాన తెరిపివ్వడం లేదు. చినుకులు తగ్గాయని పొలం గట్టుకు రైతు వెళ్లేలోపే కుండపోత వర్షం పడుతోంది. దీంతో పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక బేల చూపులు చూస్తున్నాడు. నెల రోజులలోపే చేతికి అందాల్సిన పంట నాశనమవుతుండడంతో ఆవేదన చెందుతున్నాడు.
జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరి పంట ఓ వైపు వాలే దశలో కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పొలాల నుంచి వరద నీరు బయటకు వస్తోంది. గంటగంటకు పెరుగుతున్న వాన తీవ్రతను చూసి అన్నదాత భయాందోళన చెందుతున్నాడు. రిజర్వాయర్లతో పాటు చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. సామర్థ్యానికి మించి మదుముల నుంచి వరద నీరు పారుతుండడంతో పొలాల్లోకి వరద నీరు వచ్చేస్తోంది. ఈ నీరంతా కిందనున్న చెరువులకు వెలుతుండడంతో గట్లు తెగేలా కనిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది మొంథా తుఫాన్ రూపంలో అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. కొన్ని ప్రాంతాల్లో వారం పది రోజుల్లో పంట కోతకు వచ్చే స్థితిలో ఉంది. మరికొన్ని చోట్ల కంకి కట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇంకొన్ని చోట్ల పొట్ట దశలో ఉంది. ప్రతి చోటా పంట ఏపుగా పెరగడంతో ఏమాత్రం గాలి వీచినా నేలకొరుగుతుంది. కాగా రానురాను వర్ష తీవ్రత పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గి నిమిషం పాటులో కుండపోత వర్షం పడిపోతోంది. ఇప్పటికే రిజర్వాయర్‌లు, చెరువులు పరిమితికి మించి నిండి ఎన్నాయి. పైనుంచి వరద నీరు దారాళంగా వచ్చిపడుతోంది. ఈ నీరంతా ఎప్పటికప్పుడు అధికారులు కిందకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మదుములు, కాలువల పరిమితి తక్కువగా ఉండడంతో పైనుంచి వస్తున్న వరద నీటిని ఆపలేకపోతున్నాయి.
కాగా పంట పొలాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతుందని భావించిన అధికారులు సోమవారం నుంచి అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. చెరువు గట్లు తెగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వర్షానికి లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సోమవారం సాయంత్రం శృంగవరపుకోట మండల పరిధిలోని బొడ్డవర, పోతనాపల్లి వంటి గ్రామాల్లో పర్యటించారు. ఎల్.కోట, ఎస్.కోట తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులతో సమీక్షించారు. మంగళవారం కొత్తవలస, గవరపాలెం గ్రామాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లారు.