farmer worry for no rain చినుకు రాలక.. చింత తీరక
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:33 AM
farmer worry for no rain వేసవిని తలపిస్తున్న ఎండలకు అన్నదాతలు అయోమయంలో పడ్డారు. మొన్నటివరకూ ఖరీఫ్ పరవాలేదని అనుకోగా అంతలోనే వాతావరణంలో వచ్చిన మార్పులతో ఆందోళన చెందుతున్నారు. పది రోజులుగా చినుకు జాడ లేక నిరాశ చెందుతున్నారు.
చినుకు రాలక.. చింత తీరక
వేసవిని తలపిస్తున్న ఎండలు
ఎండుతున్న నారుమడులు, వరినాట్లు
దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
కరువు మండలాలుగా ప్రకటించాలంటున్న వైనం
వేసవిని తలపిస్తున్న ఎండలకు అన్నదాతలు అయోమయంలో పడ్డారు. మొన్నటివరకూ ఖరీఫ్ పరవాలేదని అనుకోగా అంతలోనే వాతావరణంలో వచ్చిన మార్పులతో ఆందోళన చెందుతున్నారు. పది రోజులుగా చినుకు జాడ లేక నిరాశ చెందుతున్నారు. చాలా చోట్ల వరి నారు, పైరు ఎండిపోతూ కనిపిస్తోంది. కొందరు రైతులు బోరుబావుల సాయంతో వాటిని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వానలు పడకపోతే కష్టమేనంటున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పంట తొందరగా ఎండిపోకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
గజపతినగరం, ఆగస్టు6 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా జిల్లాలో వరి సాగు జోరందుకోలేదు. బోరుబావులు, సోలార్ సదుపాయం ఉన్న చోటే వరినాట్లు పడ్డాయి. ఎండల ప్రభావానికి చెరువుల్లో నీరులేక రైతులు నింగివైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతకు వరి నాట్లు ఎండిపోతున్నాయి. నారుమడులు కూడా నెర్రెలిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే నాట్లు పూర్తిస్థాయిలో పడాల్సి ఉంది. కేవలం పదిశాతం మాత్రమే వరినాట్లు పడినట్లు సంబంధిత అధికారులే చెబుతున్నారు. గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో 12874హెక్టార్లలో వరిసాగు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇంకా 1315 హెక్టార్లలో మాత్రమే రైతులు వరిసాగు మొదలు పెట్టారు. తగినంత వర్షాలు లేక ఆదిలోనే కష్టాలు చవి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 115.09 మి.మీ కాగా 87.6 మి.మీటర్ల వర్షం నమోదైంది. జూలై నెలలో 138.9మి.మీ సాధారణ వర్షపాతం కాగా 104.4మి.మీ నమోదైంది. ఆగస్టుకు సంబంధించి ఇంతవరకు ఒక్క మి.మీ వర్షపాతం నమోదు కాలేదు. గజపతినగరం మండలంలోని కాళంరాజపేట, లింగాలవలస, పిడిశీల, సీతారామపురం, శ్రీరంగరాజపురం తదితర గ్రామాల్లో వెద పద్ధతిలో వేసిన వరి నాట్లు కూడా ఎండిపోతున్నాయి. ఈ సబ్ డివిజన్ పరిధిలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ఎండల తీవ్రత కారణంగా నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఉన్నందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడికి మల్టీకె 2-3గ్రామాలు మూడు ట్యాంక్‌ల వాటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే 10 నుంచి 15 రోజుల వరకు నారుమడులకు ఉత లభిస్తుంది. అలాగే 17-17-17, 19-19-19 నీటితో కలిపి పిచికారీ చేయాలి.
- కిరణ్‌కుమార్, ఏవో, గజపతినగరం
ఐదు మండలాల్లో కరువు చాయలు
లక్కవరపుకోట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వరుణుడు కరుణించక నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఉభాలు ముందుకు సాగలేదు. ఇప్పటివరకు కనీసం 30 శాతం కూడా ఉభాలు జరగలేదు కొత్తవలస వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో జామి, కొత్తవలస, వేపాడ, ఎస్.కోట, లక్కవరపుకోట మండలాలున్నాయి. డివిజన్ మొత్తం 17,353 హెక్టార్లలో వరి పండించాల్సి ఉండగా ఇప్పటికీ 5,405 హెక్టార్లలో పంట వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 9 వేల హెక్టార్లలో ఉభాలు వేశారు. కనీసం 30 శాతం కూడా పూర్తికాలేదు. వర్షాలేక పొలాలు నెర్రెలిస్తున్నాయి. ఆగస్టు 15లోగా పంటల బీమా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. నాట్లు వేసి ఎండిపోతేనే బీమా వర్తిస్తుంది. నాట్లు వేయాలంటే వర్షం కురవాలి. ఈ సమస్యల నడుమ రైతులు సతమతమవుతున్నారు. రైతులు ఉన్నకాడికి ఇంజన్లతో నీరు తోడి పంటను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.