Share News

farmer could not get support rate రైతుల కష్టం.. దళారుల దోపిడీ

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:08 AM

farmer could not get support rate జిల్లాలో మొక్కజొన్న రైతు దిగాలుగా ఉన్నాడు. మద్దతు ధర లేదు. కొనుగోలు కేంద్రాల జాడలేదు. దీంతో దళారులు రంగప్రవేశం చేసి రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది అనూహ్యంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది.

farmer could not get support rate రైతుల కష్టం.. దళారుల దోపిడీ

రైతుల కష్టం.. దళారుల దోపిడీ

కలిసిరాని మొక్కజొన్న పంట

దిగుబడులు అంతంతమాత్రమే

ఏర్పాటుకాని కొనుగోలు కేంద్రాలు

సిండికేటైన వ్యాపారులు

తక్కువ ధరకు కొనుగోలు

రాజాం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మొక్కజొన్న రైతు దిగాలుగా ఉన్నాడు. మద్దతు ధర లేదు. కొనుగోలు కేంద్రాల జాడలేదు. దీంతో దళారులు రంగప్రవేశం చేసి రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది అనూహ్యంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 4వేల ఎకరాలు సాగుచేస్తే..ఈ ఏడాది 7 వేల హెక్టార్లలో సాగు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడూ అక్టోబరులో పంట చేతికందగా.. ఈసారి సెప్టెంబరులో కోతకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పంటను నిల్వ చేసుకునే మార్గం లేకపోయింది. పరిస్థితిని గుర్తించిన దళారులు రైతుల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. గత్యంతరం లేక ఆ ధరకే రైతులు విక్రయిస్తున్నారు.

వరి తరువాత ప్రధాన పంట

జిల్లాలో వరి తరువాత ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. జిల్లాలో మెట్ట ప్రాంతాలు అధికం. గతంలో పత్తి ఎక్కువగా సాగుచేసేవారు. పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు మొక్కజొన్న వైపు మొగ్గుచూపారు. జిల్లా వ్యవసాయ గణాంకాలు చూస్తే ఐదేళ్ల కిందట మొక్కజొన్న కేవలం 700 ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యేది. ఈ ఏడాది 7 వేల హెక్టర్లల్లో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులు బాగుంటాయని ఆశించారు. ఎందుకో ఒకనెల ముందుగానే పంట చేతికందింది. దిగుబడి గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎకరాకు 20 నుంచి 25 టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. కానీ 15 టన్నులు కూడా రాని దుస్థితి. దీనికితోడు ఆశించిన స్థాయిలో ధర కూడా లేదు. ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాకు రూ.2400గా ప్రకటించింది కానీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇదే సమయంలో వ్యాపారులు సిండికేటై రూ.2000కు అడుగుతున్నారు. దీనికితోడు క్వింటా వద్ద 3 కిలోలు అదనంగా కొలతలు వేస్తున్నారు. దీంతో రైతుకు నష్టం తప్పడం లేదు.

కొనుగోలు కేంద్రాలేవీ?

ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. జిల్లాలో 7 వేల హెక్టార్లల్లో పంట సాగు చేస్తుండగా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. సాధారణంగా మొక్కజొన్న పంట శ్రమతో కూడుకున్నది. పెట్టుబడులు కూడా ఎక్కువ. నిత్యం తడి అందించాలి. ముందుగా దుక్కులు చేసుకోవాలి. మేలైన విత్తన ఎంపిక కూడా కీలకం. అయితే ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోయారు. దీనివల్లే పంట దిగుబడి తగ్గింది. మద్దతు ధర అంతంతమాత్రమే. దీనికితోడు ఒక నెల ముందుగానే పంట అందుబాటులోకి రాగా.. వర్షాలతో పంట రంగు మారింది. ఇదే సాకుగా చూపి వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరకంటే రూ.500కు తక్కువగా అడుగుతున్నారు. చేసేదిలేక రైతులు బాధపడుతునే పంటను విక్రయించుకోవాల్సిన దౌర్భగ్య పరిస్థితి.

చాలా నష్టం

ఈ ఏడాది మొక్కజొన్న పంట ఆశాజనకంగా లేదు. వర్షాకాలంలో పంట చేతికందగా రంగుమారిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. దీంతో వ్యాపారులు అడిగినంత ధరకు అమ్ముకోవాల్సిందే. మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

- సామంతుల తవిటినాయుడు, రైతు, రాజాం

-------------

Updated Date - Oct 15 , 2025 | 12:08 AM