Far from higher education ఉన్నత చదువుకు దూరమే
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:53 PM
Far from higher educationగిరిజనుల్లో గతం కంటే అక్షరాస్యత పెరిగినా ఉన్నత చదువును మాత్రం కొందరే పొందగలుగుతున్నారు. పేదరికం ఒక కారణం కాగా వారుంటున్న ప్రాంతాలకు దగ్గరలో విద్యా సంస్థలు లేకపోవడం మరో కారణం. గిరిజన గ్రామాలతో పాటు కొండ శిఖర గ్రామాలకు రహదారులు లేకపోవడంతో ఇంకొందరు ఆదిలోనే చదువు ఆపేస్తున్నారు. మొత్తంగా పది, ఇంటర్, సాధారణ డిగ్రీలకే గిరిజన యువత పరిమితమవుతోంది. నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకుని గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతపై ప్రత్యేక కథనం.
ఉన్నత చదువుకు దూరమే
గిరిజన గ్రామాల్లో గతం కంటే కాస్త మెరుగు
కార్పొరేట్ విద్యను అందుకోలేని వైనం
పది, ఇంటర్, సాధారణ డిగ్రీలకు పరిమితమవుతున్న యువత
కొండ శిఖర ప్రాంతాల వారి పరిస్థితి మరీ దయనీయం
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
గిరిజనుల్లో గతం కంటే అక్షరాస్యత పెరిగినా ఉన్నత చదువును మాత్రం కొందరే పొందగలుగుతున్నారు. పేదరికం ఒక కారణం కాగా వారుంటున్న ప్రాంతాలకు దగ్గరలో విద్యా సంస్థలు లేకపోవడం మరో కారణం. గిరిజన గ్రామాలతో పాటు కొండ శిఖర గ్రామాలకు రహదారులు లేకపోవడంతో ఇంకొందరు ఆదిలోనే చదువు ఆపేస్తున్నారు. మొత్తంగా పది, ఇంటర్, సాధారణ డిగ్రీలకే గిరిజన యువత పరిమితమవుతోంది. నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకుని గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతపై ప్రత్యేక కథనం.
శృంగవరపుకోట, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట మండలం దారపర్తి, గూనపాడు, కురిడి, పల్లపు దుంగాడ గ్రామాలు కొండ శిఖరాన ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామాల్లో 1029 మంది నివశిస్తుండగా 167 మంది మాత్రమే అక్షరాస్యులున్నారు. వీరిలోనూ ఐదు నుంచి పదో తరగతిలోపు చదువుకున్నవారే ఎక్కువ. ఇంత చదివినా రాయడం, చదవడం తప్ప మరే విజ్ఞానం లేదు. ఎందుకంటే వీరు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేదు. గూనపాడు, పల్లపు దుంగాడ గిరిశిఖర గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఒకట్రెండు సంవత్సరాల క్రితం వరకు రహదారి సదుపాయం లేక ఉపాధ్యాయులే సరిగా వెళ్లేవారు కాదు. ఇక ఆరోతరగతి చదవాలనుకుంటే కొండదిగువన ఉన్న గ్రామాలకు 8 కిలోమీటర్లు నడిచి చేరుకోవాలి. దీంతో చదవడం, రాయడంతోనే అక్షరాస్యత శాతం లెక్కల్లోకి ఎక్కుతున్నారు. గిరిజన గ్రామాల్లో పరిస్థితికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి పల్లెలు చాలా ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయి విద్యను ప్రభుత్వాలు అందివ్వలేకపోతున్నాయి. వారి చెంతకు విద్యాసంస్థలను తీసుకెళ్లలేకపోతున్నాయి.
కొన్ని దేశాలు వెనకబడి ఉండడానికి నిరక్షరాస్యతే కారణమని 1965 నవంబర్ 17న యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ గుర్తించింది. అక్షరాస్యతను పెంచేందుకు 1966 నుంచి సెప్టెంబరు 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుతున్నారు. మన దేశంలో బీహార్, ఏపీ అక్షరాస్యతలో వెనకబడి ఉన్నాయి. రాష్ట్రంలో విజయనగరం జిల్లా 58.89శాతం అక్షరాస్యతతో వెనకబాటులోనే ఉంది. గిరిజన అక్షరాస్యతకు సంబంధించి నిర్దిష్టమైన లెక్కలు అందుబాటులో లేకపోయినప్పటికీ అక్కడి పరిస్థితులను బట్టి ఏమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
- జిల్లాలో శృంగవరపుకోట మండలం దారపర్తి, పల్లపు దుంగార, గూనపాడు, కురిడి, చిట్టెంపాడు, రేగ పుణ్యగిరి ఇలా దాదాపు 14 గ్రామాలు, వేపాడ మండలంలో మారిక, గంట్యాడ మండలంలో దిగువ కొండపర్తి గ్రామాలు కొండ శిఖరంలో ఉన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చే కొమరాడ, సాలూరు, పాచిపెంట, గుమ్మలక్ష్మిపురం తదితర మండలాల పరిధిలోనూ కొండశిఖర గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2,14,839 మంది గిరిజనులున్నారు. అక్షరాస్యత శాతానికి సంబంధించి నిర్దిష్టమైన లెక్కలను అధికారులు చెప్పలేకపోతున్నారు.
రోడ్డు లేక చదువుకు దూరం
ఉమ్మడి జిల్లాలో కొండ శిఖర గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సదుపాయం లేదు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నా అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదని సగంలో రోడ్ల నిర్మాణాలను ఆపేశారు. దీనివల్ల గిరిజన పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కొండ దిగువనున్న గిరిజన గ్రామాల్లో కూడా దాదాపుగా ఒకటి నుంచి ఐదోతరగతి వరకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆ తరువాత చదువు కోసం మైదాన ప్రాంత గ్రామాలు, పట్టణాలకే వెళ్లాలి. అంత దూరం వెళ్లే అవకాశం ఉండడం లేదు.
- గిరిజనుల్లో దాదాపుగా పేద కుటుంబాలు ఎక్కువ. పోడు వ్యవసాయం తప్ప మరే జీవనాధారం ఉండదు. ప్రభుత్వం అందించే విద్యను మాత్రమే పొందగలుగుతున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్య అందుబాటులోకి రాకముందు అందరితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉద్యోగాలు పొందిన గిరిజనుల పిల్లలు మాత్రమే ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. మైదాన ప్రాంత విద్యార్థులతో పోటీపడుతున్నారు. మిగిలిన వారంతా పది, ఇంటర్, సాధారణ డిగ్రీ, పీజీలతో సరిపెట్టుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరు బీఈడీ వంటి సాంకేతిక విద్యను అభ్యసించినప్పటికీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతున్నారు. వీరికి ఇంజనీరింగ్, మెడిషన్ విద్యలు అందని ద్రాక్షలే. ఐఐటీ, ఐఐఎంలవంటి జాతీయ విద్యాసంస్థల పేరే తెలియడం లేదు.
మెరుగైన విద్యకు రహదారులు అవసరం
మెరుగైన విద్యకు రహదారులు అవసరం. అవి లేక చాలా మంది గిరిజనులు చదువును మధ్యలో ఆపేస్తున్నారు. వాస్తవానికి గిరిజనులకు చదువుపై శ్రద్ధ పెరిగింది. అయితే కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు గిరిజన ప్రాంతాల్లో పెట్టే పరిస్థితి లేదు. వారు కూడా ఇంజనీరింగ్, మెడిషన్ వంటి ఉన్నత చదువులు చదవాలంటే ముందు ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలి.
బొబ్బిలి రామకృష్ణ, సామాజిక కార్యకర్త, శృంగవరపుకోట
ఎస్.కోటలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలి
శృంగవరపుకోటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఈ మండలంలో కొండ శిఖర గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల మండలాల్లోనూ గిరిజన అవాసాలు ఉన్నాయి. ఐదోతరగతి తరువాత దూరంగా విజయనగరంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. గిరిజన అవాసాలకు దగ్గరగా ఉంటే బాలికలను చదివించేందుకు మరింతగా ముందుకు వస్తారు.
జె.గౌరీష్, గిరిజన సంఘం నాయకుడు, శృంగవరపుకోట
------------------------------