Share News

చెరువులపై పడుతున్నారు

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:56 PM

Falling on ponds శృంగవరపుకోట- ధర్మవరం రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువిది. దీనికి సమీప గ్రామాల్లో ఇటుక బట్టీలు ఉండడంతో ఇక్కడి నుంచి మట్టిని ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా గుంతలే. రాత్రియితే ఎక్సకవేటర్లతో లోతుగా తవ్వి ట్రాక్టర్‌లకు ఎత్తేస్తున్నారు. ఎక్కడ మట్టి అనువుగా ఉంటే అక్కడ గుంతలు పెట్టేస్తున్నారు.

చెరువులపై పడుతున్నారు
ఎస్‌.కోట-ధర్మవరం రోడ్డుకు అనుకొని ఉన్న చెరువులో గుంతలు

చెరువులపై పడుతున్నారు

ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ తవ్వకాలు

ప్రమాదకరంగా గుంతలు

అవే ఊబి రూపంలో ప్రాణాలను కబళిస్తున్న వైనం

ఇటుక బట్టీలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు మట్టి తరలింపు

మదుముల వరకు సాగునీరు రాదని రైతుల్లో ఆందోళన

పట్టించుకోని జలవనరుల శాఖ అధికారులు

- శృంగవరపుకోట- ధర్మవరం రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువిది. దీనికి సమీప గ్రామాల్లో ఇటుక బట్టీలు ఉండడంతో ఇక్కడి నుంచి మట్టిని ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా గుంతలే. రాత్రియితే ఎక్సకవేటర్లతో లోతుగా తవ్వి ట్రాక్టర్‌లకు ఎత్తేస్తున్నారు. ఎక్కడ మట్టి అనువుగా ఉంటే అక్కడ గుంతలు పెట్టేస్తున్నారు.

- శృంగవరపుకోట-జామి రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ ఇటుక బట్టి వద్ద గుట్టగా పోసిన మట్టిది. ఇటుకలు తయారు చేసేందుకు దీని యజమాని మట్టిని నిల్వచేసుకుంటున్నాడు. ఈ మట్టంతా సమీప చెరువుల్లో తవ్వి తెచ్చినదే.

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా ఎక్కడబడితే అక్కడ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చెరువులను సొంత వనరులా వాడేస్తున్నారు. నచ్చినట్టు తవ్వేస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన అదాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మట్టి తవ్వకాలను అడ్డుకోవడం లేదు. మట్టిలోడుతో రోడ్లపై తిరుగుతన్న ట్రాక్టర్లను చూసైనా స్పందించడం లేదు. ఇది గమనిస్తున్న జనం భవిష్యత్‌ను తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. ఎండ తీవ్రతకు దాదాపు చెరువులన్నీ ఎండిపోయాయి. చుక్క నీరు కనిపించడం లేదు. ఇదే అదనుగా ఇటుక బట్టీలు, రియల్‌ ఎస్టేట్‌కు చెందిన యజమానులు చెరువులపై కన్నేసారు. గ్రామ పెద్దలను, అధికారులను మచ్చిక చేసుకుని గ్రామా భివృద్ధికి ఎంతోకొంత సొమ్మును అందిస్తామని నమ్మబలుకుతున్నారు. వీరికి ఎక్సకవేటర్ల యజమా నులు, మట్టిని తరలించే ట్రాక్టర్ల యజమానులు తోడయ్యారు. అంతా కలిసి సిండికేట్‌గా ఏర్పడి పగలు, రాత్రి అని తేడా లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు. ట్రాక్టర్‌ మట్టిని సమీప ప్రాంతాలకు తరలించేందుకు రూ.300ల నుంచి రూ.400 వరకు తీసుకుంటున్నారు.

తవ్వకాలతో చెరువు గర్భాలు ఎగుడు, దిగుడుగా మారుతున్నాయి. ఇలాయితే మదుముల వరకు సాగునీరు రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరంతా గుంతల్లో ఉండిపోతుందని వాపోతున్నారు. మట్టితవ్వేసమయంలో ఎక్సకవేటర్‌ యజమానులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు చెరువుల్లో నీరున్న సమయంలో దిగిన పశువులను బయటకు తోలుకొచ్చే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గుంతులున్నాయని తెలియక స్నానానికి వెళ్లిన పిల్లలు, పెద్దలు అపాయంలో పడిన ఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం తవ్వి వదిలేసిన గుంతల్లో పూడిక చేరి వర్షాకాల సమయంలో చేరిన నీటికి బాగా మెత్తబడతాయి. అవే ఊబిలా మారి ఎంతోమందిని పొట్టన బెట్టుకుంటున్నాయి.

- చెరువుల్లో మట్టిని తవ్వేందుకు అనుమతులు పొందాలి. వ్యవసాయ అభివృద్ధికి మాత్రమే అనుమతులు ఇస్తారు. ఇది కూడా నిర్ణీత రుసం చెల్లించిన యజమానులకే ఇస్తారు. ఆపై నిబంధనల ప్రకారం జలవనరుల శాఖ ఇచ్చిన సూచిన మేరకే తవ్వకాలు జరగాలి. అలా చేస్తే సాగునీటి ప్రవాహానికి ఇబ్బంది ఉండదు. గుంతల్లో పూడిక చేరే అవకాశం కూడా ఉండదు. కానీ ఎవరి అనుమతులూ లేకుండా దొంగచాటుగా చెరువుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఇదే కొనసాగితే పర్యావరణానికి నష్టంతో పాటు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ.కోట్లు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి. జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకోకపోతే చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు ఆగవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:57 PM