Extortion in Devada! దేవాడలో దోపిడీ!
ABN , Publish Date - May 04 , 2025 | 11:39 PM
Extortion in Devada! వైసీపీ ప్రభుత్వ హయాంలో భూమి, ఆకాశమే హద్దుగా దోపిడీ పర్వం నడిచింది. ఇసుక, మట్టి, కంకర ఇలా ఏ సహజ వనరునూ వదల్లేదు. అరుదుగా లభించే ఖనిజ సంపదను సైతం కొల్లగొట్టారు. గరివిడి మండలం దేవాడలో ఇదే మాదిరిగా మాంగనీసును పెద్ద ఎత్తున తరలించుకుపోయినట్టు తెలుస్తోంది.
దేవాడలో దోపిడీ!
ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్
మాంగనీసు తవ్వకాల్లో గోల్‌మాల్
అనుమతి కొంత.. తవ్వకాలు లెక్కలేనంత
లక్ష టన్నులు అదనంగా తవ్వినట్లు ఫిర్యాదులు
అప్పట్లో లీజు టెండర్లలో సైతం మాయ
వైసీపీ ప్రభుత్వ హయాంలో భూమి, ఆకాశమే హద్దుగా దోపిడీ పర్వం నడిచింది. ఇసుక, మట్టి, కంకర ఇలా ఏ సహజ వనరునూ వదల్లేదు. అరుదుగా లభించే ఖనిజ సంపదను సైతం కొల్లగొట్టారు. గరివిడి మండలం దేవాడలో ఇదే మాదిరిగా మాంగనీసును పెద్ద ఎత్తున తరలించుకుపోయినట్టు తెలుస్తోంది. వందలాది ఎకరాల్లో మైనింగ్ చేసి వేల కోట్ల టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేశారు. అప్పట్లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కొంతైతే అంతకు మించి తవ్వకాలు చేపట్టారు. దీనిపై తాజాగా ఫిర్యాదులు వచ్చాయి.
విజయనగరం, మే4(ఆంధ్రజ్యోతి):
గరివిడి మండలం దేవాడ మైనింగ్ బ్లాక్ పరిధిలోని దువ్వాం, కోడూరు, కొండపాలెంలో అపార మాంగనీసు ఖనిజాలు ఉన్నాయని అప్పట్లో కేంద్ర భూగర్భ గనుల శాఖ గుర్తించింది. వాటిపై నాటి వైసీపీ పాలకుల కన్నుపడింది. ఈ మూడు గ్రామాల పరిధిలో 81.95 హెక్టార్లలో మైనింగ్ జరుపుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ఈ-వేలం నిర్వహించింది. మహాలక్ష్మీ మినరల్స్ పేరిట నెల్లూరుకు చెందిన గూడురు శశిధర్ రెడ్డి, వెంకటరెడ్డి టెండరు దక్కించుకున్నారు. ఇక్కడ ఏడాదికి 10 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వుకునేందుకు వీలుగా లీజుదారుడికి అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని అప్పట్లో స్థానికులు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయసేకరణలో సైతం గళం ఎత్తారు. ఇవేవీ అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మహాలక్ష్మీ మినరల్ సంస్థకు లీజు కట్టబెట్టేశారు. లీజు ఒప్పందానికి ముందే ఆ ప్రాంతాన్ని సదరు సంస్థ ఆధీనంలోకి తీసుకుంది. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువగా మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లాది రూపాయల విలువైన మాంగనీసును అక్రమంగా తవ్వి తరలించినట్టు చెప్పుకుంటున్నారు.
తక్కువకు కోట్ చేసిన కంపెనీకే..
మహాలక్ష్మీ మినరల్ సంస్థ అప్పటి ప్రభుత్వ పెద్దలకు బినామీ అన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం 2021 మేలో టెండర్లను ఆహ్వానించింది. మహాలక్ష్మీ మినరల్స్, ఎంపీ మినరల్స్, ఆర్‌బీఎస్‌ఎస్‌డీ సంస్థ, పీఎం గ్రానైట్స్ సంస్థ టెండర్లు దాఖలు చేశాయి. అయితే ఎక్కువకు కోడ్ చేసిన పీఎం గ్రానైట్ ఎక్స్‌పోర్టు సంస్థను కాదని మహాలక్ష్మి మినరల్స్‌కు లీజుకు ఇచ్చారని, టెండర్ల నిర్వహణలో కనీస నిబంధనలు పాటించలేదన్న విమర్శలున్నాయి. ఈ లీజు టెండర్లలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోయినట్టు ఆరోపణలున్నాయి. కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దల బినామీ సంస్థ కావడం వల్లే లీజు టెండర్లను మహాలక్ష్మీ మినరల్స్‌కు అప్పగించినట్టు సమాచారం.
అంతకు మించి తవ్వకాలు
లీజు సంస్థ ఏడాదికి 10 లక్షల టన్నుల ఖనిజం తవ్వకాలకు అనుమతులు తీసుకుంది. అంతకు మించి తవ్వకాలు జరుపుతోంది. లీజు పొందిన సమయానికే తవ్వకాలు మొదలుపెట్టేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో అధికారులు గ్రామాలకు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మాంగనీసు తవ్వకాలతో కాలుష్యం పెరుగుతుందని..తమకు పునరావాసం కల్పించి, తరువాతే తవ్వకాలు చేపట్టాలని ఆ మూడు గ్రామాల ప్రజలు కోరారు. అప్పటి వైసీపీ నేతలు ప్రజాభిప్రాయ సేకరణలో సమయంలోనే దౌర్జన్యానికి దిగారు. బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నయానో.. భయానో లీజు పొందారు. ఇప్పటివరకూ జరిపిన తవ్వకాల్లో లక్ష టన్నులకు పైగా మాంగనీసు తవ్వకాలు అక్రమంగా జరిగినట్టు బహాటంగానే ఆరోపణలున్నాయి. అధికారులు ప్రతి ఏడాది ఖనిజ తవ్వకాల కోసం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే తీసుకున్న పర్మిట్‌లు కంటే ఎక్కువగా తరలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మాంగనీసు తవ్వకాలు, తరలింపునకు సంబంధించి రూ.కోట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
- దీనిపై స్థానిక జనసేన పార్టీకి చెందిన తుమ్మగంటి సూరినాయుడు మైనింగ్‌లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మండల సమావేశాల్లో గొంతు వినిపించారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
- అక్రమ మైనింగ్ అంశాన్ని జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు వద్ద ప్రస్తావించగా తవ్వకాలపై ఆర్‌ఐను పంపించి పరిశీలిస్తామని, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.