Fertilizer Shops ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:14 PM
Extensive Inspections in Fertilizer Shops జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? అధిక ధరలకు విక్రయిస్తున్నారా! తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. నిల్వలు.. స్టాకు రికార్డుల్లో తేడాలుంటే షాపులను సీజ్ చేస్తున్నారు.
రంగంలోకి సబ్ కలెక్టర్లు
పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో కదిలిన యంత్రాంగం
పార్వతీపురం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రైతులకు ఎరువులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? అధిక ధరలకు విక్రయిస్తున్నారా! తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. నిల్వలు.. స్టాకు రికార్డుల్లో తేడాలుంటే షాపులను సీజ్ చేస్తున్నారు. కాగా మంగళవారం ఒక్కరోజు మన్యంలోని సుమారు వంద షాపుల్లో తనిఖీలు చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి పార్వతీపురంలో ఎరువులు దుకాణాలు, మార్కెట్ యార్డులో గోడౌన్‌ను తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి.. ఎంఆర్‌పీకి మించి ఎరువులను విక్రయిస్తే సహించేది లేదన్నారు. ఇక పార్వతీపురం పట్టణం సాలూరు, మక్కువ, జియ్యమ్మవలస, భామిని, వీరఘట్టం తదితర మండలాల్లోనూ రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎరువుల షాపులను పరిశీలించారు. కాగా తనిఖీల అనంతరం కలెక్టర్‌కు నివేదికలు అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్ తెలిపారు.
- భామిని: పాలకొండలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ పాయింట్‌లో ఉన్న ఎరువుల నిల్వలు, రికార్డులను సరి చూశారు. ఆన్‌లైన్ బిల్లులను రైతులకు అందించాలని ఆదేశించారు. వారికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందించాలన్నారు.రైతుల నుంచి ఫిర్యాదులు లేకుండా చూడా లన్నారు. అనంతరం లుంబూరులోని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రైతులతో ప్రభుత్వపరంగా ఇస్తున్న ఎరువులు, విత్తనాలపై ఆరా తీశారు.
కొరత లేకుండా చూడాలి..
పార్వతీపురం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ఎరువుల పర్యవేక్షణపై మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అవసరమైన పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటి కోసం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎరువుల దుకాణాలపై పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఏకకాలంలో ఆయా షాపుల్లో తనిఖీలు నిర్వహించి నివేదికను అందించాలని వ్యవసాయ, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ శోభిక, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.