Share News

e-Crop ఈ-క్రాప్‌ నమోదుకు గడువు పెంపు

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:40 PM

Extension of deadline for e-Crop registration జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి ఈ-క్రాప్‌ నమోదుకు అధికారులు గడువు పొడిగించారు. ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా ఈనెల 25తో నమోదు ప్రక్రియ ముగిసింది. కాగా కొన్ని మండలాలు వెనుకబడి ఉండటంతో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ సమయం పొడిగించారు.

 e-Crop ఈ-క్రాప్‌ నమోదుకు గడువు పెంపు
రావుపల్లిలో ఈ-క్రాప్‌ నమోదు చేస్తున్న వ్యవసాయ సిబ్బంది

  • నిబంధనల మార్పుతో జాప్యం

గరుగుబిల్లి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి ఈ-క్రాప్‌ నమోదుకు అధికారులు గడువు పొడిగించారు. ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా ఈనెల 25తో నమోదు ప్రక్రియ ముగిసింది. కాగా కొన్ని మండలాలు వెనుకబడి ఉండటంతో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ సమయం పొడిగించారు. 2025 ఖరీఫ్‌కు గాను జిల్లాలో 1,67,843 ఎకరాల్లో ఈ-క్రాప్‌ నిర్వహించాల్సి ఉంది. 8,290 ఎకరాల్లో అరటి, 15,634 ఎకరాల్లో పామాయిల్‌, 14,322 ఎకరాల్లో పత్తికి సంబంధించి ఈ-క్రాప్‌ నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది 1,75,463 ఎకరాలకు పైగా ఈ-క్రాప్‌ నిర్వహించారు. ఈ ఏడాది జూలై నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.

ఇదీ పరిస్థితి..

గత వైసీపీ ప్రభుత్వ హయంలో 0.25 సెంట్లు పైబడిన వారికే ఈ-క్రాప్‌ నిర్వహించేవారు. మరోవైపులో నమోదులో పలు అవకతవకలు నెలకొన్నాయి. పలు రకాల పంటలను మార్పు చేసి నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. రైతులు సాగు చేస్తున్న ప్రతి సెంటు ప్రాంతాన్ని విధిగా ఈ-క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయాల సిబ్బంది, మండల వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలోనే పరిశీలించి రైతులు సాగు చేస్తున్న పంటలను నమోదు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సిగ్నల్‌ సమస్యతో ఈ పక్రియ నిర్వహణ కష్టతరంగా మారింది. అదేవిధంగా రెవెన్యూ గ్రామాల పరిధిలో సరైన సర్వే నెంబర్లు లేకపోవడం, వెబ్‌ల్యాండ్‌లో పలు సమస్యలు సిబ్బందికి తలనొప్పిగా మారాయి. క్షేత్రస్థాయిలో ఒకలా, రికార్డుల్లో మరొలా ఉండడంతో ఈ క్రాప్‌ నమోదు ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ ఏడాదికి జిల్లాలో రైతులు మొత్తంగా 3.20 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. అయితే 2.80 లక్షల మేరకే ఈ-క్రాప్‌ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 1,67,843 ఎకరాల వరకే నమోదు ప్రక్రియ పూర్తయింది.

నిబంధనల మార్పుతో జాప్యం

‘ఈ-క్రాప్‌ నిబంధనల మార్పుతో నమోదు ప్రక్రియలో కొంతమేర జాప్యం నెలకొంది. రైతు సాగు చేస్తున్న ప్రతి పంటనూ నమోదు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యలు నెలకొన్నాయి. అయినప్పటికీ అవకతవకలకు ఆస్కారం లేకుండా నమోదు చేస్తున్నాం. ఈ నెలా ఖరుకు పూర్తిస్థాయిలో ఈ-క్రాప్‌ పూర్తవుతుంది.’ అని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్‌పాల్‌ తెలిపారు.

Updated Date - Oct 26 , 2025 | 11:40 PM