Exploding shotgun పేలుతున్న నాటు తుపాకీ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:34 AM
Exploding shotgun జిల్లాలో వారం రోజుల తేడాతో రెండు సార్లు నాటు తుపాకీ పేలింది. రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండేళ్ల కిందట కూడా ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని అడ్డతీగ గిరిజన గ్రామ సమీపంలో నాటు తుపాకీతో అడవిపందిని చంపే ప్రయత్నంలో తూటా తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు. కనుమరుగైన నాటు తుపాకులు ఇలా అప్పుడప్పుడు బయటపడుతున్నాయి.
పేలుతున్న నాటు తుపాకీ
హత్యలకు ఉపయోగిస్తుండడంపై ఆందోళన
లైసెన్స్‌లు పొందకుండా వినియోగం
కార్డెన్ సెర్చ్ పేరుతో గిరిజన గూడాల్లో పోలీసుల తనిఖీలు
- ఈనెల 5న కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెంది ఎస్.అప్పారావు నాటు తుపాకీతో కాల్చేశాడు. తీవ్ర రక్తస్రావంతో సిమ్మ అప్పారావు అక్కడికక్కడే మరణించాడు. బంగారం, డబ్బులు, భూమి విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. ఎంత అడిగినా ఇవ్వడం లేదన్న కోపంతో ఎస్.అప్పారావు హత్య చేశాడు.
- జూలై 28న శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర గిరిజన పంచాయతీ శివారు చిట్టెంపాడు గిరిజన గ్రామానికి చెందిన సీదిరి రామును ఇదే గ్రామానికి చెందిన నాగరాజు నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. భూమిని తన పేరున రాసేయాలని నాగరాజు చిన్నాన్న రాముతో కొన్నాళ్లుగా గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగింది.
విజయనగరం/ శృంగవరపుకోట/ కొత్తవలస, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వారం రోజుల తేడాతో రెండు సార్లు నాటు తుపాకీ పేలింది. రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండేళ్ల కిందట కూడా ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోని అడ్డతీగ గిరిజన గ్రామ సమీపంలో నాటు తుపాకీతో అడవిపందిని చంపే ప్రయత్నంలో తూటా తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు. కనుమరుగైన నాటు తుపాకులు ఇలా అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. మందుగుండుకు ఉపయోగించే సామగ్రిని ఈ నాటు తుపాకీలకు గుళ్లుగా వాడుతున్నారు. తయారీలో సీసా పెంకులు, ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగిస్తుండడంతో మనిషికి తగిలిన క్షణాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. ఆత్మరక్షణ, మాంసాహారం కోసం పక్షలు, అడవి పందులు, ముళ్ల పందుల వంటి వాటిని వేటాడేందుకు వినియోగించాల్సిన ఈ నాటు తుపాకీలను పగతీర్చుకొనేందుకు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. లైసెన్స్‌లు లేకుండా నాటు తుపాకీలు కలిగి ఉండడం కలకలం సృష్టిస్తోంది.
కొన్నేళ్ల క్రితం సంచార జాతులు, కొండ శిఖర అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు క్రూర మృగాల నుంచి రక్షణ పొందేందుకు, పంటలను కాపాడుకొనేందుకు వీటిని వాడేవారు. ప్రభుత్వం నలభై ఏళ్ల క్రితం నాటు తుపాకీల వాడకానికి అనుమతులు ఇచ్చేది. అయితే విద్య, ఉపాధి అవకాశాలు పెంపోందించుకోవడంతో కాలక్రమంలో సంచార జాతులు కనుమరుగయ్యాయి. వన్యప్రాణుల సంతతి కాపాడుకునే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా వేటను నిషేధించాయి. దీంతో అధికారులు నాటు తుపాకీలకు అనుమతులు ఇవ్వడం మానేశారు. లైసెన్స్‌లు ఇవ్వకపోయి నప్పటికీ నాటు తుపాకీల లెక్క పోలీస్ శాఖ వద్ద ఉండేది. సార్వత్రిక, స్థానిక ఎన్నికల సమయంలో ఈ నాటుతుపాకీలను పోలీస్ శాఖ స్వాధీనం చేసుకొనేది.. ఎవరెవరి దగ్గర నాటు తుపాకీలు ఉన్నాయో తెలుసుకొనేది. ఈ ప్రక్రియ ఇప్పుడు అంత పకడ్బందీగా జరగడం లేదు.
ఉలిక్కిపడి.. కార్డెన్ సెర్చ్ చేపట్టి
గిరిజన ప్రాంతాల్లో మాత్రమే నాటు తుపాకులు అక్కడక్కడ ఉండొచ్చునని భావించిన పోలీస్ శాఖకు మైదాన ప్రాంతంలో కూడా నాటు తుపాకీ పేలుడు వినిపించడం ఉలిక్కిపడేట్లు చేసింది. జూలై 28న ఎస్.కోట మండలం దారపర్తి శివారు పల్లపుదుంగాడ గిరిజన గ్రామంలో నాటు తుపాకీతో చిన్నాన్నను చంపేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీస్‌లు రెండు రోజుల అనంతరం జూలై 31న హత్య జరిగిన గ్రామానికి ఆనుకుని ఉన్న 16 గిరిజన గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్.కోట, కొత్తవలస, విజయనగరం రూరల్ సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 85 మంది పోలీస్ సిబ్బంది నాటు తుపాకీల కోసం అనువనువు గాలించారు.
డీఎస్పీ హెచ్చరించిన కొద్ది రోజులకే..
లైసెన్స్‌లు లేకుండా ఆయధాలు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని, ఎవరి వద్దనైనా అనుమతులు లేకుండా ఆయధాలు లభిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించి వారం గడవకముందే కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలో నాటు తుపాకీ పేలింది.
గంజాయి, సారా రవాణాలో కూడా..
గంజాయి, సారా రవాణా సమయంలో అటవీ జంతువుల నుంచి రక్షణ కోసం నాటు తుపాకులను వెంట ఉంచుకుంటున్నట్లు సమాచారం. అక్రమ వ్యాపారానికి అలవాటుపడిన వారు ఆయుధాలను కూడా సమకూర్చుకుంటున్నారు. వారు అడవులు, కొండ శిఖర గ్రామాల నుంచి సరుకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి తగ్గింది. కానీ తాజా కాల్పుల ఘటనలతో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
అందుకే కార్డెన్ సెర్చ్
జిల్లాలో నాటు తుపాకీల వినియోగంపై నిఘా పెట్టాం. ఇప్పటికే గిరిజన గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టాం. 2007 నుంచి 2025 వరకు పదేళ్ల కాలంలో 438 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నాం. ఇవి కాకుండా వివిధ కేసులకు సంబంధించి కోర్టు ద్వారా 160 తుపాకీలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా ఎవరి వద్దనైనా ఉన్నాయేమో గుర్తించాలని ఆదేశించాం. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధం కలిగి ఉండడం నేరం. జిల్లాలో నాటు తుపాకీతో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. విస్తృతంగా తనిఖీలు చేపట్టి వాటిని స్వాధీనం చేసుకుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- వకుల్‌జిందాల్, ఎస్పీ, విజయనగరం
నిందితుని కోసం గాలింపు
కొత్తవలస, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తుపాకీతో కాల్చి పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా కె.కోటపాడుమండలం పాతవలస గ్రామానికి చెందిన ఎస్.అప్పారావు ముసిరాం గ్రామానికి చెందిన సమీప బంధువు శిమ్మ అప్పారావును కాల్చి చంపిన విషయం తెలిసిందే. రెండుతులాల బంగారం విషయమై గొడవ పడి నాటు తుపాకీతో అంతమొందించాడు. నిందితుడిని పట్టుకోవడానికి మంగళవారం రాత్రి నుంచి గాలిస్తున్నారు. కొత్తవలస-కె.కోటపాడు రోడ్డులో శృంగవరం వద్ద మోటార్ సైకిలిస్టును లిఫ్టు అడిగి బండిఎక్కి పరారీ అయినట్టు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో నిందితుని చేతిలో తుపాకీ లేదని పోలీసులకు చెప్పారు. దీంతో హత్యకు వినియోగించిన తుపాకీని ఎక్కడైనా పడేసి వెళ్లిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిమ్మఅప్పారావు మృతదేహానికి బుధవారం ఎస్.కోట సీహెచ్‌సీలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు.
----------------