Share News

లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం సాధ్యం

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:13 AM

లోక్‌ అదాలత్‌లో కేసులకు స్నేహపూరిత వాతా వరణంలో పరిష్కారం దొరుకుతుందని, సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఆమె మాట్లాడారు.

 లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం సాధ్యం
విజయనగరం క్రైం: బాధితులకు చెక్కు అందజేస్తున్న ప్రధాన న్యాయాధికారి బబిత:

విజయనగరం క్రైం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌లో కేసులకు స్నేహపూరిత వాతా వరణంలో పరిష్కారం దొరుకుతుందని, సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9,513 కేసులను పరిష్కరించినట్టు చెప్పారు. మోటారు ప్రమాద బీమాకు సంబంధించి రూ. 90 లక్షల పరిహారానికి చెందిన చెక్కును పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయాధికారి అందజేశారు. ఈ లోక్‌అదాలత్‌లో న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

రాజీయే మేలు..

రాజాం రూరల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక్‌అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు, సీనియర్‌ న్యాయాధికారి కె.శారదాంబ స్పష్టం చేశారు. అదాలత్‌లలో రాజీకి అనుకూలమైన అన్నికేసులూ పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. అదాలత్‌లో ఇచ్చినది అంతిమతీర్పుగా వివరించారు. ఇక్కడి కోర్టు సముదాయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయలోక్‌ అదాలత్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శారదాంబ, జూనియర్‌ సివిల్‌ జడ్జి నైమిష రెండు బెంచ్‌లను ఏర్పాటుచేసి 814 కేసులు పరిష్కరించారు. మొత్తంగా రూ.31,49,578 విలువైన కేసులు పరిష్కరించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

రాజీతో కేసుల పరిష్కారం..

గజపతినగరం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కోర్టులలోని కేసులను రాజీ ద్వారా పరిష్కరిం చుకోవాలని న్యాయాధికారి ఎ.విజయ్‌రాజ్‌కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలో గల గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ మండలాలకు సంబంధించి 1215 కేసులను రాజీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రమేష్‌రాజు, చప్పా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

కక్షిదారులకు ప్రయోజనం..

కొత్తవలస, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌లలో కేసులు రాజీ చేసుకోవడం కక్షిదారులకు మంచిదని న్యాయాధికారి డాక్టర్‌ సముద్రాల విజయ్‌ చందర్‌ అన్నారు. శనివారం కొత్తవలస కోర్టు ఆవరణలో లోక్‌ అదాలత్‌ నిర్వహణకు ముందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన గొడవలు...కేసుల కారణంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. లోక్‌ అదాలత్‌లలో రాజీ చేసుకోవడం ఇరువర్గాలకు మంచిదన్నారు. ఈ కార్య క్రమంలో ప్రభుత్వ న్యాయవాది ఎంవీఎస్‌ గిరిబాబు, న్యాయవాద సంఘం అధ్యక్షురాలు డీవీఎల్‌ దేవి, న్యాయవాదులు ప్రసాద్‌, డి.శ్రీనివాస్‌, నందిపల్లి శ్రీరామమూర్తి, ఎక్సైజ్‌ సీఐ రాజశేఖరనాయుడు, ఎస్‌ఐ జోగారావు తదితరులు పాల్గొన్నారు.

450 కేసుల పరిష్కారం..

శృంగవరపుకోట, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆవరణలో శనివారం న్యాయాధికారి బి.కనకలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. దీనిలో రాజీ ద్వారా 450 వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెకెండ్‌ క్లాస్‌ న్యాయమూర్తి జి.అప్పలనాయుడు, సిబ్బంది కె.శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:13 AM