Share News

Expansion.. like this? విస్తరణ.. ఇలానా?

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:38 PM

Expansion.. like this? రాజాంలో రెండోవిడత రహదారి విస్తరణ పనులపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. నిర్మాణాల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ, మునిసిపాలిటీ సంయుక్త పర్యవేక్షణలో పనులు జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎవరికివారే యమునా తీరే చందంగా ఆయాశాఖల అధికారులు వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్‌కు చెందిన ప్రతినిధులు ఇష్టారాజ్యంగా పనులు జరిపిస్తున్నారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

Expansion.. like this? విస్తరణ.. ఇలానా?
గోడ, భవనం శ్లాబ్‌, డూమ్‌ తొలగించకుండా కాల్వ నిర్మాణం

విస్తరణ.. ఇలానా?

రాజాం ప్రధాన రహదారి నిర్మాణంపై విమర్శలు

నాణ్యతపై అనుమానాలు

భవనాల గోడలు తొలగించకుండా కాల్వల నిర్మాణం

పునాదుల్లేకుండా డివైడర్ల పనులు

నిర్మాణ సమయంలోనే కూలిపోతున్న డివైడర్లు

రాజాంలో రెండోవిడత రహదారి విస్తరణ పనులపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. నిర్మాణాల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ, మునిసిపాలిటీ సంయుక్త పర్యవేక్షణలో పనులు జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎవరికివారే యమునా తీరే చందంగా ఆయాశాఖల అధికారులు వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్‌కు చెందిన ప్రతినిధులు ఇష్టారాజ్యంగా పనులు జరిపిస్తున్నారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

రాజాం రూరల్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాజాం ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందుకు సంతోషించే లోపే లోపాలు బహిర్గతమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. నాణ్యతకు దూరంగా పనులు చేస్తున్నట్లు స్థానికుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. జూలై చివరి వారంలో రాజాం-డోలపేట మధ్య ఓ వైద్యుడికి చెందిన భవనం వద్ద 80 అడుగులకు బదులు 75 అడుగుల మేర విస్తరించి కాల్వ నిర్మాణం జరిపిన విషయాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ బహిర్గతం చేసింది. దీంతో రంగంలోకి దిగిన మునిసిపాలిటీ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఆ ఐదు అడుగులు సరిచేసి 80 అడుగులు ఉండేలా తిరిగి నిర్మాణం జరిపినా.. ప్రస్తుతం పాత భవనాలకు సంబంధించిన నిర్మాణాలు తొలగించలేదు. డివైడర్ల నిర్మాణంలోనూ రోడ్డును తవ్వి కాంక్రీట్‌ వేసి డివైడర్‌ నిర్మించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రోడ్డుపైనే డివైడర్‌ నిర్మిస్తున్నారు. అవి ఎక్కడికక్కడే కూలిపోతుండడం విస్తరణ పనుల నాణ్యతలో డొల్లతనం స్పష్టమవుతోంది.

రాజాంలో రెండోవిడత విస్తరణకు సంబంధించి బొబ్బిలి జంక్షన్‌ నుంచి గాయత్రీ కాలనీ వరకూ 1.34 కిలోమీటర్లు, అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి జీఎంఆర్‌ ఐటీ వరకు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో 80 అడుగులమేర విస్తరించాల్సి ఉంది. 3.34 కిలోమీటర్ల పనులకు రూ.20 కోట్లు నిధులు మంజూరయ్యాయి. బొబ్బిలి జంక్షన్‌ నుంచి గాయత్రీ కాలనీ వరకూ జరిగిన కాల్వల నిర్మాణ పనులతో పాటు డివైడర్ల నిర్మాణాలపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమందికి అనుకూలంగా కాల్వల నిర్మాణంలో చేతివాటం ప్రదర్శించారన్న అపవాదును ఆర్‌అండ్‌బీ, మునిసిపాలిటీ అధికారులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినాసరే.. అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి జీఎంఆర్‌ ఐటీ వరకూ ప్రస్తుతం జరుగుతున్న కాల్వల నిర్మాణంలో సైతం కొంతమందికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వారి ఆరోపణలకు బలం చేకూర్చేలా నిర్మాణాలు సైతం కనిపిస్తున్నాయి.

పైన భవనాల డూమ్‌లు.. కింద కాలువ

కాల్వల నిర్మాణం విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న అపవాదు వినిపిస్తోంది. వాస్తవానికి కాల్వ నిర్మాణ జరిపే సమయంలో భవనం గోడలు కొట్టాల్సి ఉంటుంది. అయితే రాజాం-డోలపేట రోడ్‌లో మోర్‌ ఎదుట షాపుల గోడలు, డూమ్‌లు కొట్టకుండా కాల్వ నిర్మాణం జరిపిస్తున్నారు. పైన డూమ్‌లు ఉంటుండగానే కింద కాల్వ నిర్మాణం చేపట్టడంపై పట్టణవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెయిన్‌రోడ్‌ విస్తరరణ సమయంలో నిర్దేశించిన 80 అడుగుల మేర భవనాలను కొట్టి కాల్వ నిర్మించారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా కాల్వ నిర్మాణం చేపట్టడం వెనుక కాసులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇలా నిర్మాణం జరిపితే ఫుట్‌పాత్‌ ఉండేదెక్కడో అధికారులకే తెలియాలి.

డివైడర్లు సైతం...

80 అడుగుల మేర రహదారి విస్తరణ సమయంలో రహదారిని కొంతమేర తవ్వి కాంక్రీట్‌ వేసి డివైడర్‌ను నిర్మించాల్సి ఉంది. అయితే అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి డోలపేటకు వెళ్లే మార్గంలో మోర్‌ ఎదుట రోడ్డును తవ్వకుండా, కాంక్రీట్‌ వేయకుండా రోడ్డుపైనే డివైడర్‌ నిర్మాణం పనులు జరిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు డివైడర్‌ పనులు జరుగుతుంటే మరోవైపు ఎక్కడికక్కడ బీటలు వారి డివైడర్లు విరిగిపోతున్నాయి.

80 అడుగుల మేరకే ..నాగభూషణరావు, ఏఈ, ఆర్‌అండ్‌బి, రాజాం.

నిబంధనల మేరకు 80 అడుగులకు తగ్గకుండా రహదారి విస్తరణ పనులు జరిపిస్తున్నాం.. కాల్వల నిర్మాణం కూడా ఆ పరిధిలోనే ఉంది. ఫుట్‌పాత్‌లపై గోడలు, శ్లాబ్‌లు, డూమ్‌లు తొలగించి, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే. ఇందులో మా ప్రమేయం లేదు. కాలువలతో కలిపి 80 అడుగుల మేర విస్తరిస్తున్నాం..

మార్కింగ్‌ ఇచ్చాం

రామ అప్పలనాయుడు, కమిషనర్‌, రాజాం మున్సిపాలిటీ.

ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు ఉండకూడదు. పాదచారులు రాకపోకలకు వీలుగా ఫుట్‌పాత్‌లు ఉండాలి. విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో భవనాల యజమానులకు ఇప్పటికే అందరికీ మార్కింగ్‌ ఇచ్చాం. ఆ మేరకు శ్లాబ్‌లు, డూమ్‌లు, తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి. లేకపోతే నోటీసులిచ్చి తామే తొలగిస్తాం.

Updated Date - Sep 15 , 2025 | 11:38 PM