Teachers’ Recruitment టీచర్ల నియామకానికి కసరత్తు
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:15 AM
Exercise for Teachers’ Recruitment మెగా డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉపాధ్యాయుల నియమానికి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను ఒకటి, రెండు రోజుల్లో పరిశీలించే అవకాశముంది.
ఉమ్మడి జిల్లాలో భర్తీ కానున్న 583 పోస్టులు
సాలూరు రూరల్,ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉపాధ్యాయుల నియమానికి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను ఒకటి, రెండు రోజుల్లో పరిశీలించే అవకాశముంది. దీనికి సంబంధించి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఎంఈవోలు, ఎల్‌డీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లుతో కూడిన 24 మంది బృందం బుధవారం విజయవాడలో శిక్షణ పొందింది. ఈ బృందం జిల్లాకు చేరుకుని మెగా డీఎస్సీలో మెరిట్ సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనుంది.
వచ్చేనెలలో విధుల్లో చేరే అవకాశం..
ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 583 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారు. అభ్యర్థులు సాధించిన మార్కులను వ్యక్తిగత స్కోర్ కార్డులను ఈ నెల 11న విద్యాశాఖ విడుదల చేసింది. భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి జిల్లా విద్యాశాఖ నుంచి అందించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు ఏ తేదీన రావాల్సి ఉంటుందో వారి మొబైల్స్‌కు మెసేజ్‌లు వచ్చే అవకాశముంది. మెగా డీఎస్సీలో టీచర్లు పోస్టుల భర్తీకి తుది అంకానికి చేరుకుంది. ధ్రువపత్రాల పరిశీలన తదితర కార్యక్రమం అనంతరం వచ్చే నెలలో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరే అవకాశముంది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టే టీచర్ పోస్టుల భర్తీకి కృతనిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తుండడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీలు ఇలా..
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలు 210, పాఠశాల సహాయకులు క్యాడర్‌లో తెలుగులో 14, హిందీలో 14, ఆంగ్లంలో 23,గణితంలో 8, భౌతికశాస్త్రంలో 32, జీవశాస్త్రంలో 20, సాంఘిక శాస్త్రంలో 62, పీఈటీ 63 మొత్తం 446 టీచర్ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీలు 60 పాఠశాల సహాయకుల క్యాడర్‌లో ఆంగ్లంలో 7, గణితంలో 25, భౌతిక శాస్త్రంలో 24, జీవశాస్త్రంలో 16,సాంఘిక శాస్త్రంలో 5 మొత్తం 137 టీచర్ పోస్టులు ఖాళీలను చూపించారు.