Everything is ready for the flag festival. జెండా పండగకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:06 AM
Everything is ready for the flag festival.
జెండా పండగకు
సర్వం సిద్ధం
పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు
500 మంది ఉత్తమ అధికారుల ఎంపిక
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కొండపల్లి
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూలు, జాతీయ జెండాలతో గ్రౌండును అలంకరించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలు, సెర్ప్,ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. 9.30కు మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. అనంతరం జిల్లా ప్రముఖులను మంత్రి పరిచయం చేసుకుంటారు. 10 గంటలకు పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన మొదలవుతుంది. 10.45కు జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైబడి ఉత్తమ అధికారులు, సిబ్బందిని ఎంపిక చేశారు. 11.30కు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్‌ను మంత్రి సందర్శిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవానికి కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్‌జిందాల్, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
విజయనగరం క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ వకుల్‌జిందాల్ గురువారం పరిశీ లించారు. సాయుధ పోలీసుల పరేడ్ రిహార్సల్స్‌ను పర్యవేక్షించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఏఎస్‌పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, ఆర్‌ఐలు గోపాలనాయుడు, రమేష్‌కుమార్, శ్రీనివాసరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
సీఐ రామకృష్ణకు రాష్ట్రపతి పోలీసు మెడల్
విజయనగరం క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): భోగాపురం సీఐ రామకృష్ణకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు మెడల్ దక్కింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా సీఐ రామకృష్ణ ఎంపికయ్యారు. ఈయన ఇప్పటివరకు అనేక అవార్డులు, రివార్డులు పొందారు.
రామకృష్ణ 2004లో ఎస్‌ఐగా విధుల్లో ప్రవేశించారు. 2006 నుంచి 2009 వరకూ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకం అందించింది. ఆపై రామకృష్ణ 2013లో సీఐగా పదోన్నతి పొందారు. డీజీపీ కమాండేషన్ డెస్క్ అవార్డు రెండు సార్లు, ఏబీసీలో ఉత్తమ అవార్డు రెండు సార్లు, రెండు క్యాష్ రివార్డులు, గుడ్ సర్వీస్ అవార్డులు పొందారు. 2014 నుంచి 2017 వరకూ సాలూరు సీఐగా ఉంటూ విశాఖలో స్పెషల్ ఇన్విస్టిగేషన్, సిట్‌లోనూ, స్పెషల్ బ్రాంచ్ విజయనగరంలోనూ, పోలీసు శిక్షణ కళాశాలలోనూ విధులు నిర్వహించారు. గత ఏడాది నుంచి భోగాపురం సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఈయన చూపే ప్రతిభ, ఇతర సేవలను గుర్తించిన డీఐజీ గోపీనాథ్ జెట్టీ, ఎస్పీ వకుల్‌జిందాల్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో రాష్ట్రపతి పోలీసు మెడల్‌కు రామకృష్ణ ఎంపికయ్యారు.
మరింత బాధ్యతను పెంచింది: సీఐ రామకృష్ణ
కేంద్ర ప్రభుత్వం తన సేవలను గుర్తించి రాష్ట్రపతి పోలీసు మెడల్‌కు ఎంపిక చేయడం ద్వారా మరింత బాధ్యత పెంచింది. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేశాను. సైబర్ నేరాలు, నేరాల నియంత్రణ తదితర వాటిపై ప్రజలపై అవగాహన కల్పించి ఫ్రెండ్లీ పోలీసింగు విధానం అమలయ్యేలా ప్రయత్నించాను. తన సేవలను గుర్తించిన డీఐజీ గోపీనాథ్ జెట్టీ, ఎస్పీ వకుల్‌జిందాల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: మంత్రి
విజయనగరం టౌన్, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): ప్రతి పౌరుడూ దేశభక్తిని చాటేందుకు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ వద్ద ఆమె గురువారం సెల్ఫీ దిగారు.