Share News

జెండా పండగకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:36 PM

జెండా పండగకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 జెండా పండగకు సర్వం సిద్ధం
సిద్ధమైన వేదిక

- స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన మన్యం

- పూర్తయిన ఏర్పాట్లు

- జెండా ఆవిష్కరించనున్న మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జెండా పండగకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ పనితీరును తెలిపేలా శకటాలను ప్రదర్శించనున్నారు. పోలీస్‌ పరేడ్‌, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఉత్తమసేవలందించిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్‌ కోరారు.

599 మందికి ప్రశంసాపత్రాలు

జిల్లాలో రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య తదితర శాఖల్లోపనిచేస్తున్న 599 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించనున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి చేతుల మీదుగా వారు ప్రశంసాపత్రాలు అందుకోనున్నారు.

ఐటీడీఏలో జాతీయ జెండా ఆవిష్కరించనున్న కలెక్టర్‌

పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్‌, ఐటీడీఏ చైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ఐటీడీఏకు పూర్తిస్థాయి పీవో లేరు. ఇన్‌చార్జి పీవోగా ఉన్న సబ్‌ కలెక్టర్‌కు బదిలీ అయింది. కొత్తగా నియామకమైన సబ్‌ కలెక్టర్‌కు ఇన్‌చార్జి పీవో బాధ్యతను ప్రభుత్వం అప్పగించలేదు. దీంతో ఐటీడీఏ చైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:36 PM