Everything is ready for Ganpati Puja. గణపతి పూజకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:29 PM
Everything is ready for Ganpati Puja. గణపతి నవరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. వాడవాడలా వినాయకుడు కొలువుదీర నున్నాడు. మండపాలను ఉత్సవ కమిటీలు అందంగా అలంకరించాయి. ఆధునిక హంగులను కూడా అద్దాయి. వీధులు విద్యుత్ దీపాల వెలుగులో కొత్త కళను సంతరించుకున్నాయి. ఏటా మాదిరి ఈ ఏడాది కూడా భారీ వినాయక ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు.
గణపతి పూజకు సర్వం సిద్ధం
ఫ హంగులతో రూపుదిద్దుకున్న మండపాలు
విద్యుత్ వెలుగుల్లో వీధులు ఫ కిటకిటలాడిన మార్కెట్‌లు
వర్షాలతో తప్పని అవస్థలు
రాజాం/ విజయనగరం కల్చరల్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): గణపతి నవరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. వాడవాడలా వినాయకుడు కొలువుదీర నున్నాడు. మండపాలను ఉత్సవ కమిటీలు అందంగా అలంకరించాయి. ఆధునిక హంగులను కూడా అద్దాయి. వీధులు విద్యుత్ దీపాల వెలుగులో కొత్త కళను సంతరించుకున్నాయి. ఏటా మాదిరి ఈ ఏడాది కూడా భారీ వినాయక ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను కూడా విభిన్నంగా తయారు చేయించారు. ముందురోజు వర్షం పడినప్పటికీ గణేశుడి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అనుమతులు పొందిన మండపాలకు మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో ఎక్కువ మంది అనుమతులు తీసుకున్నారు. ఇందుకోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1000 మండపాలు ఏర్పాటయ్యే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కొన్ని సూచనలు ఇచ్చారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకూ మాత్రమే మైకులకు అనుమతి ఇచ్చారు. ఉత్సవాల్లో మద్యం, నిషేధిత వస్తువులు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం రోజున విగ్రహానికి తగ్గట్టు వాహనాన్ని ఏర్పాటుచేసుకోవాలని, చెరువులు, నదుల వద్ద పిల్లలు, మైనర్లను దూరంగా ఉంచాలని చెప్పారు.
రద్దీగా మార్కెట్
వినాయక చవితి సందర్భంగా విజయనగరం మార్కెట్ మంగళవారం రద్దీగా కనిపించింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా పూజా సామగ్రి కొనుగోలుకు బారులుతీరారు. వినాయక విగ్రహాలతో పాటు వివిధ రకాల పండ్లు, పూలు, ప్రత్యేక దినుసులను విరివిగా కొనుగోలు చేశారు. సాయంత్రం 4 గంటలు తరువాత వర్షం తెరిపి ఇవ్వడంతో మార్కెట్ మరింతగా కిటకిటలాడింది. గంటస్తంభం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా, న్యూపూర్ణ జంక్షన్, కోట, దాసన్నపేట రింగురోడ్డు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ప్రాంతం తదితర ప్రాంతాలు రద్దీగా కన్పించాయి. మామిడాకుల నుంచి గరికపూస వరకూ కొనుగోలు దారులు అన్నింటినీ మార్కెట్‌లోనే కొనుగోలు చేశారు. వర్షం ప్రభావంతో అన్ని రకాల వస్తువులకు వ్యాపారులపైనే ఆధారపడ్డారు. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, వెలమకాయ, నారింజ, శీతాఫలం, అరటి పండ్లు ఇలా రకరకాల పండ్లకు గిరాకీ ఏర్పడింది. కిలో యాపిల్ రూ.200 దానిమ్మ కూడా రూ.200 నుంచి 250, ద్రాక్ష రూ.150 చొప్పున అమ్ముడుపోగా, వెలమ, నారింజ, శీతాఫలం కాయ ఒక్కటి రూ.10 చొప్పున విక్రయించారు. అరటి పండ్లు డజను రూ 50 నుంచి రూ.80 వరకూ పలికింది.
- వినాయక ప్రతిమల విక్రయాలకు వర్షం ఆటంకంగా నిలిచింది. ఉదయం నుంచి దుకాణాలు వెలవెలబోయాయి. సాయంత్రం నుంచే ఆయా విగ్రహాలు కొనుగోలు చేయడానికి జనం రోడ్లపైకి వచ్చారు.