Everything is ready సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:17 AM
Everything is ready మెగా డీఎస్సీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీ పడుతున్న 18001 మంది అభ్యర్థులు శుక్రవారం నుంచి గ్రూపుల వారీగా పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 30 వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు జరుగుతాయి.
సర్వం సిద్ధం
నేటి నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 18001 మంది అభ్యర్థులు
మహిళలే అధికం
మొత్తం దరఖాస్తులు 34,629
విజయనగరం కలెక్టరేట్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీ పడుతున్న 18001 మంది అభ్యర్థులు శుక్రవారం నుంచి గ్రూపుల వారీగా పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 30 వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఆన్‌లైన్ పరీక్ష కావడం, ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో ఉదయం కొందరికి, మధ్యాహ్నం కొందరికి పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా 583 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలే కాకుండా డిఫరెంట్ ఏబుల్డ్ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్త యూనిట్‌గా చూపించిన 2,259 టీచర్ పోస్టుల్లో జోన్ ఒకటికి 400 కేటాయించారు. రాష్ట్రం యూనిట్‌గా భర్తీ చేయనున్న మరో 259 టీచర్ పోస్టులకు సైతం ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులు పోటీ పడవచ్చు. జిల్లా నుంచి 18001 మంది వివిధ పోస్టులకు 34,629 దరఖాస్తులందించారు. మహిళ అభ్యర్థులే అధికంగా ఉన్నారు. మహిళలు 10,225 మంది కాగా పురుష అభ్యర్థులు 7776 మంది డీఎస్సీకి హాజరవుతున్నారు. డీఎస్సీలో పలువురు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నందున వారికి వెసులుబాటు ఉండేలా పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. టీజీటీలు, పీజీటీలు, ఎస్జీటీలు, ప్రిన్సిపాల్స్ ఇలా వివిధ కేటగిరీలకు వివిధ తేదీలను కేటాయించారు. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్‌కు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఈ నెల 23,24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్స్, పీజీటీ, పీడీ పోస్టులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఐదు కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. విజయనగరంలోని సీతం కాలేజీ, ఐయాన్ డిజిట్ జోన్, లెండి ఇంజినీరింగ్, ఎంవిజిఆర్, అవంతి కళాశాలల్లో పరీక్ష జరగనుంది. ప్రతి సెంటర్‌లో 300 నుంచి 350 మంది వరకూ హాజరుకానున్నారు. హాల్ టిక్కెట్‌తోపాటు తప్పనిసరిగా ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారు.
గంట ముందు హాజరుకావాలి
డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఉండండి. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సదుసాయాలు కల్పించాం. హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి.
- మాణిక్యంనాయుడు, డీఈవో
పోస్టుల వారీగా హాజరుకానున్న అభ్యర్థులు( రెండు దశల్లో కలిపి)
పోస్టు మొదటి సెషన్ రెండో సెషన్ మొత్తం
------------------------------------------------------------------------------
ఎస్‌జీటీ 4852 2319 7171
ఎస్‌ఏ తెలుగు 940 47 987
ఎస్‌ఏ గణితం 253 1390 1643
ఎస్‌ఏ ఫిజక్స్ 1392 1391 2783
ఎస్‌ఏ బయోలజీ 436 1390 1826
ఎస్‌ఏ సోషల్ 1880 941 2821
పీఈటీ 1414 - 1414
ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) 150 1391 1541
ఇంగ్లీష్ ప్రొఫిసియన్సీ టెస్టు 1964 700 2664
పీజీటీఅండ్ టీజీటీ 2648 9125 11773
--------------------------------------------------