Share News

ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:05 AM

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సిరిమాను చెట్టును కొడుతున్న మంత్రి శ్రీనివాస్‌

  • రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

  • సిరిమాను, ఇరుసుమాను చెట్లను కొట్టే ప్రక్రియకు శ్రీకారం

గంట్యాడ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. బుధవారం గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో వెలసిన పైడితల్లమ్మ వారి ప్రతి రూపంగా భావించే సిరిమాను చెట్టును మంత్రి శ్రీనివాస్‌ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య చెట్టుకి గొడ్డలితో గాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పైడిమాంబ విజయానికి ప్రతిరూపమన్నారు. అమ్మవారి సిరిమాను పండుగను, దాంతో పాటుగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్మవారు సిరిమాను రూపంలో తమ నియోజకవర్గ పరిఽధిలోని గంట్యాడ మండలంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టమన్నారు. అమ్మవారు రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు రావాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులనాయుడు, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పాలవలస యశస్వి, ఆర్‌డీఓ కీర్తి, ఆలయ సహాయ కమిషనర్‌ శిరీష, డీఎఫ్‌ఓ కొండలరావు, డీఎస్పీ గోవిందరావు, ఎంఆర్‌ఓ నీలకంఠేశ్వరరెడ్డి, పూజారి బంటుపల్లి వెంకటరావు, సిరిమాను, ఇరుసుమాను చెట్ల దాతలైన రైతులు చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ, లోకవరపు సత్యం, అధికారులు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:07 AM