ప్రతి రైతూ వ్యాపారవేత్తగా ఎదగాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:51 PM
జిల్లాలోని ప్రతి రైతూ వ్యాపారవేత్తగా ఎదగాలి. ఆ దిశగా అధిక దిగుబడి, రాబడి వచ్చే పంటలవైపు మొగ్గుచూపాలి.’ అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
సాలూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి రైతూ వ్యాపారవేత్తగా ఎదగాలి. ఆ దిశగా అధిక దిగుబడి, రాబడి వచ్చే పంటలవైపు మొగ్గుచూపాలి.’ అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మామిడిపల్లి రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలను వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇక్కడి రైతులు చాలా ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తున్నారని, సంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించడమే కాకుండా అంతర్ పంటలపై కూడా మంచి అవగాహన ఉందని కితాబిచ్చారు. రైతుల ఆదాయ, వ్యయ వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చే యాలన్నారు. వారి ఆదాయం పెంచేందుకు సరైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 67వేల ఎకరాల్లో రైతులు సంప్రదాయ సేద్యం చేస్తున్నారని అన్నారు. ఉద్యాన పంటల్లో కూడా మంచి మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది జిల్లా అభివృద్ధిలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలు కీలకపాత్ర పోషించనున్నట్టు వివరించారు. గతంలో కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ వృద్ధిని చూడబోతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, ఉద్యానశాఖాధికారి కె.సత్యనారాయణరెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి ఎస్.మన్మథరావు, ఏడీఏ జి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు అరుదైన గౌరవం
పార్వతీపురం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డికి ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 27, 28 తేదీల్లో ముస్సోరిలో కలెక్టర్లతో జరిగే ఎన్‌కేఎస్‌హెచ్‌ఏ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్‌ను ఆహ్వానించింది. రెండు రోజుల శిక్షణ, వర్క్‌షాప్‌కు హాజరై కలెక్టర్లకు శిక్షణ ఇవ్వాలని కోరింది. రెవెన్యూ, సర్వే, భూ రికార్డులు వంటి భూపరిపాలన వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై దేశంలోనే అత్యంత అనుభవం, మంచి పరిజ్ఞానం కలిగిన అధికారిగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డికి మంచి పేరు ఉండడంతో ఆయనను ఈ మేరకు ఆహ్వానించింది.