Even without permission.. అనుమతి లేకపోయినా..
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:03 AM
Even without permission.. విజయనగరంలో ఓ మద్యం దుకాణం చెంతనే ఫాస్టుఫుడ్ సెంటర్ పేరిట షాపును తెరిచారు. అందులో కూర్చొని తినేందుకు వీలుగా కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ వేశారు. కర్టైన్స్ వేసి లోపల మరిన్ని టేబుల్స్, కుర్చీలు వేశారు. అందులోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. రోజుకు అక్కడ జరిగే వ్యాపారం రూ.20 వేల పైమాటేనని తెలుస్తోంది.
అనుమతి లేకపోయినా..
అనధికారికంగా ప్రత్యేక గదుల ఏర్పాటు
మద్యం షాపుల సమీపంలోనే
కూర్చొని తాగేందుకూ సౌకర్యాలు
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు
ఆకర్షితులవుతున్న యువత
- విజయనగరంలో ఓ మద్యం దుకాణం చెంతనే ఫాస్టుఫుడ్ సెంటర్ పేరిట షాపును తెరిచారు. అందులో కూర్చొని తినేందుకు వీలుగా కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ వేశారు. కర్టైన్స్ వేసి లోపల మరిన్ని టేబుల్స్, కుర్చీలు వేశారు. అందులోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. రోజుకు అక్కడ జరిగే వ్యాపారం రూ.20 వేల పైమాటేనని తెలుస్తోంది.
- డెంకాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ఓ దాబాలో అనధికారికంగా మద్యం సేవిస్తున్నారు. లోపల మందుబాబులు మద్యం తాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బయట నుంచి మద్యం తెచ్చుకుని ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. వయసుతో పనిలేదు. అక్కడ రోజుకు రూ.50 వేలకుపైగా వ్యాపారం జరుగుతోంది.
విజయనగరం, జూన్ 28(ఆంధ్రజ్యోతి):
ఒక్క విజయనగరం, డెంకాడలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అనుమతి తీసుకోకుండా దాబాలను పోలినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మద్యం వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. వారే స్వయంగా కూడా మద్యం విక్రయిస్తున్నారు. ఇదంతా అనధికారికం. ఇలాంటివి జిల్లాలో 500 వరకూ వెలిసినట్టు సమాచారం. గత ఏడాది అక్టోబరులో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం దుకాణాలను టెండర్ల రూపంలో ప్రైవేటు వ్యక్తులకు ఖరారు చేసింది. అయితే ఒక్క మద్యం అమ్మకాల ద్వారా అయితే లాభాలు చాలవని భావించిన మద్యం దుకాణదారులు అనధికారికంగా పర్మిట్ రూమ్‌ల మాదిరి ఎక్కడికక్కడ తెరిచేశారు.
వాస్తవానికి మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం ఎటువంటి పర్మిట్ రూమ్‌లకు అనుమతివ్వలేదు. ఒకవేళ అక్కడే తాగేందుకు అవకాశమిస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.5 లక్షలు కట్టాలి. ఈ విషయాన్ని నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొంది. షాపులో మద్యం నిల్వలు చాలకుంటే అదనంగా గోదాములు అద్దెకు తీసుకున్నవారు ఏడాదికి ప్రభుత్వానికి రూ.లక్ష వరకూ చెల్లించాలి. కానీ జిల్లాలో చాలావరకూ మద్యం షాపులు పర్మిట్ రూమ్‌లకు అనుమతి తీసుకోలేదు. అదనంగా ప్రభుత్వానికి రూపాయి చెల్లించలేదు. కానీ ఎక్కడికక్కడే మద్యం దుకాణాల సమీపంలో ఈ తరహా షాపులు వెలిశాయి. వాటిని మద్యం దుకాణదారులే అద్దెకు ఇవ్వడమో.. అనధికారికంగా నిర్వహించడమో చేస్తున్నారు. అదే మాదిరిగా గోదాములు సైతం అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
21 ఏళ్లు నిండని వారికి మద్యం అమ్మకూడదన్న నిబంధన కూడా పక్కకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడే దాబాలు, వైన్‌షాపుల వద్ద అనధికారిక పర్మిట్ రూమ్‌ల వద్ద చిన్నవయసు వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు అటువైపుగా చూడడం లేదు. వాస్తవానికి మద్యం షాపులుకు సంబంధించి డ్రా తీయకుండా ముందే చాలా మంది సిండికేట్‌గా మారారు. షాపులు ఎవరికి దక్కినా.. అందరికీ వాటాలు అన్నవిధంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో లాటరీ తీసిన తరువాత కూడా ఒప్పందాలు జరిగాయి. ఒక్కో మండలంలో కనిష్టంగా ఐదు వరకూ షాపులను ఏర్పాటుచేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 7 నుంచి 10 వరకూ షాపులు ఏర్పాటయ్యాయి. కొన్ని షాపుల్లో రోజువారీ విక్రయాలు అధికంగా ఉన్నాయి. మరికొన్ని వాటిలో ఆశించిన స్థాయిలో జరగడం లేదంటున్నారు. ఇలా విక్రయాలు తక్కువగా ఉన్నచోట ‘బెల్ట్’ను ప్రోత్సహించినట్టు ఆరోపణలున్నాయి. మందుబాబులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, ఆహారం, చిరుతిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో అక్కడ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు జరిగిపోతోంది.
అంతా బహిరంగమే..
ఇటీవల బహిరంగ మద్యం తాగుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏకంగా డ్రోన్ కెమెరాలను ప్రయోగించారు. విజయనగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయినా సరే మందుబాబుల తీరులో మార్పు రాలేదు. ఇంకా బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. క్రీడా మైదానాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖాళీ స్థలాల్లో మందుబాబుల అడ్డాలుగా మారిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు మద్యం బాబుల సందడి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో ఈ సంస్కృతి అధికంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం కానీ జిల్లాలో ఈ నిబంధన అమలు కావడం లేదు.