Share News

the Obstruction Continues! ప్రభుత్వం మారినా.. అడ్డుకట్ట పడలే!

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:32 PM

Even with a Change in Government.. the Obstruction Continues! గత టీడీపీ ప్రభుత్వ కాలంలో అది రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం. వైసీపీ సర్కారు పాలనలో రెవెన్యూ ప్రాంతంగా మారింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాటి కోర్టు ఆదేశాలు చూపుతూ పార్వతీపురం మండలం బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతున్నారు. కోట్లాది రూపాయల గ్రానైట్‌ను యథేచ్చగా తరలిస్తున్నారు.

 the Obstruction Continues!  ప్రభుత్వం మారినా.. అడ్డుకట్ట పడలే!
గ్రానైట్‌ తవ్వకాలతో రూపు కోల్పోయిన బడిదేవరకొండ

  • కోట్లాది రూపాయల గ్రానైట్‌ తరలింపు

  • గత వైసీపీ సర్కారు హయాంలో ఆదేశాలు

  • ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉందంటున్న అటవీ శాఖ

  • అయినా చర్యలు శూన్యం.. ఆందోళనలో గిరిజనులు

పార్వతీపురం, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ కాలంలో అది రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం. వైసీపీ సర్కారు పాలనలో రెవెన్యూ ప్రాంతంగా మారింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాటి కోర్టు ఆదేశాలు చూపుతూ పార్వతీపురం మండలం బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతున్నారు. కోట్లాది రూపాయల గ్రానైట్‌ను యథేచ్చగా తరలిస్తున్నారు. వాస్తవంగా గత వైసీపీ సర్కారు పాలనలో సర్వే నివేదికలు మారిపోగా... దీని వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు న్నాయి. గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పరిధిలో ఉందని 2017లో హైకోర్టుకు ఆధారాలతో తెలియజేసిన అటవీశాఖ.. వైసీపీ ప్రభుత్వ కాలంలో పూర్తిగా కళ్లుమూసుకుందనే విమర్శలున్నాయి. ఏదేమైనా రిజర్వ్‌ ఫారెస్ట్‌గా గుర్తించిన ఈ ప్రాంతం రెవెన్యూ శాఖకు ఎలా చెందుతుందో, ఏ విధంగా గనులశాఖ అనుమతులు మంజూరు చేసిందో? తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి...

- పార్వతీపురం మండం పోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో, మొలగ రెవెన్యూ పరిధిలోనూ గ్రానైట్‌ కొండలు ఉన్నాయి. వాటిపై కొంతమంది గ్రానైట్‌ వ్యాపారులు కన్నేశారు. ఈ మేరకు సర్వే నెంబర్‌-1లో 18.5 హెక్టార్లలో కలర్‌ గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు గాను రెవెన్యూశాఖ నివేదికలతో గనులశాఖ కాంట్రాక్టర్లకు అనుమతులు మంజూరు చేసింది.

- దీనిపై అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. తవ్వకాలకు అనుమతులిచ్చిన ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందని ఆధారాలతో సహా నిరూపించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రైవేట్‌ పిటీషన్‌ దాఖలు చేయడంతో హైకోర్టు స్పందించింది. గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ప్రాంతం ఏ పరిధిలో ఉంది? సర్వే చేసి నివేదికను అందించాలని అప్పట్లో గనులు, రెవెన్యూ, అటవీశాఖ ర్రాష్ట ఉన్నతాధికారులను ఆదేశించింది.

- ఆ మూడు శాఖల ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి కోర్టుకు నివేదిక అందించారు. గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్నట్టు తేల్చారు. దీంతో అప్పట్లో హైకోర్టు గనులశాఖ ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. తాము కొలుస్తున్న ఆరాధ్యదేవత కొండను అటవీశాఖాధికారులు రక్షించారని పండుగ చేసుకున్నారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతోకాలం నిలువలేదు.

- వాస్తవంగా రిజర్వ్‌ఫారెస్ట్‌ పరిధిలో ఎటువంటి తవ్వకాలు చేపట్టాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉండాలి. గాని అటువంటి అనుమతులు లేకుండానే బడిదేవరకండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు కొనసాగుతున్నాయి.

గిరిజనుల ఆరాధ్య దేవత...

గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ప్రాంతంతో పాటు ములగ, సంగంవలస తదితర రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న కొండను బడిదేవరమ్మ దేవత నిలయంగా గిరిజనులు భావిస్తున్నారు. అందుకే ఏటా బడిదేవరమ్మ తల్లికి వారు ప్రత్యేక పూజలు చేసి.. గిరిజన సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లిస్తుంటారు. బడిదేవరమ్మను తమ ఆరాధ్యదైవతగా కొలుస్తారు. అయితే అటువంటి కొండపై గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టడంపై ఆ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో...

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో.. బడిదేవరకొండ ప్రాంతంలో సర్వే ఆఫ్‌ ఇండియా మొక్కుడిగా సర్వే నిర్వహించి హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చిందన్న ఆరోపణలున్నాయి. కాగా ఈ నివేదిక ప్రకారం ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే జిల్లా అటవీ, రెవెన్యూ శాఖల అధికారలుఉ అంగీకారం తెలిపిన తర్వాతే గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రానైట్‌ వ్యాపారులు రంగంలోకి దిగి.. ఈ ప్రాంతం రెవెన్యూ పరిధిలో ఉంటుందని సర్టిఫికెట్‌ పొందారు. అటవీ శాఖను సంప్రదించ కుండా గనులశాఖకు రెవెన్యూశాఖ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని అందించి ఆగమేఘాలపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు పొందారు.

ఎన్నికల ఫలితాల తర్వాత..

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బడిదేవరకొండ ప్రాంతంల్రో గానైట్‌ తవ్వకాలు పునఃప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూపి యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నారు. విలువైన గ్రానైట్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై ప్రస్తుత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంపై ఆ ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. తక్షణమే దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

అటవీశాఖ తీరు ఇలా..

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇష్టారాజ్యంగా గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నా... నేటికీ అటవీ శాఖ వాటిని అడ్డుకోలేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఆధారాలతో సహా వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తే.. గతంలో మాదిరిగా అటవీశాఖకు తిరిగి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే అటవీశాఖ నుంచి వెళ్లిన పిటీషన్‌ పత్రాల్లో ఏదో లోపం ఉందని, దీంతో హైకోర్టు మెట్లు ఎక్క కుండానే తిరిగి అవి జిల్లాకు చేరుతున్నాయని తెలుస్తోంది. ఫారెస్ట్‌ అధికారులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో పిటీషన్‌ వేయకుండా ఉండడానికి కారణాలు ఏమిటన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.

ఎమ్మెల్యేకు ఫిర్యాదు

గ్రానైట్‌ తవ్వకాల వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజాభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తవ్వకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. కాగా గ్రానైట్‌ తవ్వకాలు ఆపే విధంగా ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉంది

‘గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉంది. ప్రభుత్వ న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్‌ వేసి నిరూపిస్తాం.’ అని డీఎఫ్‌వో ప్రసూన తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 11:32 PM