రెండున్నరేళ్లయినా పూర్తికాలే!
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:36 AM
చీపురుపల్లి ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) పనుల్లో జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంకా పూర్తికాలేదు.
- చీపురుపల్లి ఆర్వోబీ పనుల్లో జాప్యం
- పరిష్కారంకాని సర్వీసు రోడ్డు వివాదం
- అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కొరవడిన ముందుచూపు
- ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
చీపురుపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) పనుల్లో జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంకా పూర్తికాలేదు. సర్వీసు రోడ్డు వివాదం పరిష్కారం కాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు చూపు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా చీపురుపల్లి మీదుగా రాజాం వైపు వెళ్లే ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
చీపురుపల్లి పట్టణానికి నడిబొడ్డున సుమారు వందేళ్ల కిందట నిర్మించిన ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కాల పరిమితి పూర్తి కావడంతో, దాని స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి రైల్వే అధికారులు ప్రతిపాదించారు. దీని కోసం రైల్వే శాఖ రూ.11 కోట్లు మంజూరు చేసింది. 2023 మార్చి 20న రైల్వే ఉన్నతాధికారులు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ మిగతా పనులు ఇంకా పూర్తి కాలేదు. అప్రోచ్ రోడ్డు, దానికి అనుసంధానంగా నిర్మించాల్సిన సర్వీసు రోడ్డు విషయంలో వివాదం తలెత్తింది. బ్రిడ్జికి సమీపంలో రైల్వే ట్రాక్‌ను ఆనుకొని ఉన్న రిక్షా కాలనీ, కొత్తఅగ్రహారం ప్రాంతాలకు ఇప్పటి వరకూ పాత బ్రిడ్జి పక్కనుంచి మార్గం ఉంది. ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఈ రోడ్డు మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, కొత్తగా ఆర్వోబీ నిర్మిస్తుండడంతో ఈ రోడ్డు మూత పడే పరిస్థితి ఏర్పడింది. రిక్షా కాలనీ, కొత్తఅగ్రహారం ప్రాంతాలకు రహదారి సౌకర్యం యధావిధిగా కొనసాగాలంటే, మెయిన్ రోడ్డులో ఉన్న ఆక్రమణలు తొలగించాలి. వాటి తొలగింపుపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. సర్వీసు రోడ్డు నిర్మాణం కోసం తమకు తగినంత స్థలం అప్పగించాలని ఇప్పటికే రైల్వే అధికారులు ప్రతిపాదించడంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కళావెంకటరావు కూడా ఆక్రమణదారులతో మాట్లాడి, ఆక్రమించిన స్థలంలో కనీసం పది అడుగుల స్థలాన్ని సర్వీసు రోడ్డు కోసం వదులుకోవాలని సూచించారు. అయితే, ఆ పని మాత్రం ఇప్పటి వరకూ జరగలేదు. దీంతో సర్వీసు రోడ్డు, ఆర్వోబీ అప్రోచ్ రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కొత్త ఆర్వోబీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సమయంలోనే ఆక్రమణల తొలగింపుపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి ఉంటే, ఇప్పుడింత జాప్యం జరగకపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారికి ముందు చూపు లేకపోవడంతో రెండున్నరేళ్లయినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం లేదు. దీంతో విశాఖ, విజయనగరం వైపు నుంచి చీపురుపల్లి మీదుగా రాజాం వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.