గ్రేడ్ పెరిగినా..
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:39 PM
రాజాం మునిసిపాలిటీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఏ వార్డులో చూసినా అపరిశుభ్రతే.
- పారిశుధ్యం మాత్రం మెరుగుపడలే
- కంపు కొడుతున్న వార్డులు
- రోడ్లపై నిలిచిపోతున్న మురుగు
- ఇదీ రాజాం మునిసిపాలిటీలో దుస్థితి
- రాజాం ఆదర్శనగర్ కాలనీలో దుస్థితి ఇది. మురుగు నీటి కాలువ పూర్తిగా కనుమరుగైంది. ఇలా మురుగు నీరు బయటకు వచ్చి నిల్వ ఉండిపోతోంది. దీంతో నిత్యం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మునిసిపల్ అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండా పోతోందని సమీప నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- కొండంపేట రోడ్డు చెంతనే పారిశుధ్యం పరిస్థితి ఇది. పట్టణానికి సంబంధించి వాడుక నీరు వెళ్లే కాలువలు సరిగ్గా లేక..ఇలా రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో అటువైపుగా వెళ్లేవారు దుర్గంధం భరించలేకపోతున్నారు. సమీప నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రాజాం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజాం మునిసిపాలిటీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఏ వార్డులో చూసినా అపరిశుభ్రతే. కాలువలు లేకపోవడంతో మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. మురుగు నీటి కాలువలు పూర్తిస్థాయిలో లేకపోవడం, పారిశుధ్య సిబ్బంది కొరత, పాలకవర్గం లేక జవాబుదారీతనం కొరవడడం తదితర కారణాలతో మునిసిపాలిటీలో పారిశుధ్యం దారుణంగా మారింది. గ్రేడ్-2గా మునిసిపాలిటీ స్థాయి పెరిగినా పారిశుధ్యం మాత్రం మెరుగుపడలేదని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
రాజాం మునిసిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. 11 వేల ఇళ్లు ఉన్నాయి. 48 వేల మంది జనాభా ఉన్నారు. 2021లో గ్రేడ్-2 మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. కానీ ఆ స్థాయిలో వసతులు మెరుగుపరచలేదు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు తగినంత మంది లేరు. మొత్తం 100 మంది వరకూ పారిశుధ్య కార్మికులు ఉండాలి. కానీ ప్రస్తుతం 56 మంది ఉన్నారు. పెరిగిన పట్టణ అవసరాలకు తగినంత మంది లేరు. దీంతో ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లలో మాత్రమే పారిశుధ్య పనులు జరుగుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం దారుణంగా ఉంది. ప్రధానంగా విశ్వశాంతినగర్, బాబానగర్, గాంధీనగర్, డోలపేట, మెంతిపేట, ఎస్సీ కాలనీ, యాతపేట, శ్రీకాకుళం రోడ్లలో పారిశుధ్యం దారుణంగా మారుతోంది. కాలువల నుంచి మురుగు నీరు బయటకు వస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు దోమలతో వ్యాధుల తీవ్రత కూడా అధికంగా ఉంది. ప్రస్తుతం పట్టణ వ్యాప్తంగా జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజు వందలాది మంది స్థానిక సామాజిక ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా మునిసిపల్ యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
దృష్టిపెట్టాం..
మునిసిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. తగినంతమంది పారిశుధ్య కార్మికులు లేకపోవడం వాస్తవమే. కానీ ఉన్నవారితో అన్ని వార్డుల్లో పనులు చేపడుతున్నాం. బ్లీచింగ్ చల్లడంతో పాటు క్లోరినేషన్‌ను సైతం చేపడుతున్నాం.
- ఎ.రామచంద్రరావు, కమిషనర్, రాజాం మునిసిపాలిటీ