Share News

Even now.. will Rajam change? ఇప్పుడైనా.. రాజాం మారేనా?

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:12 AM

Even now.. will Rajam change? రాజాం మారబోతోంది.. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి.. కొత్త నేతలు వస్తారు.. కోరింది చేస్తారు.. అంటూ నెల రోజులుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. 20 ఏళ్లుగా పాలకవర్గం లేక అభివృద్ధిలో వెనకబడిన రాజాంలో కొత్తదనం కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

Even now.. will Rajam change? ఇప్పుడైనా.. రాజాం మారేనా?
రాజాం పట్టణం

ఇప్పుడైనా.. రాజాం మారేనా?

విలీన పంచాయతీల చేర్పులు, మార్పులకు అవకాశం

ఆ మూడు పంచాయతీల్లో అభిప్రాయ సేకరణ

వద్దంటే మిగతా ప్రాంతాలతో కలిపి ఎన్నికలు

20 ఏళ్లుగా పాలకవర్గం లేక నిలిచిన అభివృద్ధి

రాజాం మారబోతోంది.. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి.. కొత్త నేతలు వస్తారు.. కోరింది చేస్తారు.. అంటూ నెల రోజులుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. 20 ఏళ్లుగా పాలకవర్గం లేక అభివృద్ధిలో వెనకబడిన రాజాంలో కొత్తదనం కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. పంచాయతీల విలీనం, మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల అనుమతివ్వడంతో ఆ మూడు పంచాయతీల్లో ప్రజాభిప్రాయం చేపట్టే అవకాశం ఉంది. అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. వారు వద్దనుకుంటే మిగతా ప్రాంతాలతో కలిపి రాజాం మునిసిపాల్టీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

రాజాం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి):

రాజాం మునిసిపాల్టీలో ఎన్నికలకు అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ చొరవతో ఓ దారి అయితే ఉంది. విలీన పంచాయతీల చేర్పులు, మార్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఎలాంటి వివాదాలు లేకుండా ఎన్నికలకు వెళ్లొచ్చునని స్థానికులు, నేతలు భావిస్తున్నారు. సమీప పంచాయతీల విలీన ప్రక్రియ తర్వాత ఆయా గ్రామాల ప్రజలు అభ్యంతరాలు తెలపడం, కోర్టులో కేసులు వేయడంతో గత 20 ఏళ్లుగా రాజాంలో ఎన్నికలు లేవు. అభివృద్ధి అనేదే లేకుండా పోయింది. కొత్త భవనాలు లేవు. కార్యాలయాలకు సొంత నీడ లేదు. ఉద్యోగులకు సౌకర్యాలు లేవు. ఏ సమస్య చెప్పుకుందామన్నా ప్రజలు అధికారుల వద్దకే వెళ్లాల్సి వస్తోంది. అలాగని అధికారులు కూడా సకాలంలో ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. వెరసి ఒక అయోమయ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితి నుంచి మారడానికి ప్రభుత్వం ఓ దారి అయితే చూపిస్తోంది. గ్రామాల విలీనం, చేర్పులు, మార్పులపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజాం మునిసిపాల్టీలో విలీన పంచాయతీల సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

రాజాం నగర పంచాయతీగా 2005లో రూపాంతరం చెందింది. రాజాంలో కలిసి ఉన్న సారధి మేజర్‌ పంచాయతీలో సమీపంలోని పొనుగటివలస, కొత్తవలస, కొండంపేటలను విలీనం చేస్తూ రాజాం నగర పంచాయతీని ఏర్పాటుచేశారు. దీనిని ఆయా పంచాయతీలు వ్యతిరేకించాయి. పాలకవర్గాలు ఉండగానే ప్రత్యేక తీర్మానం చేసి నగర పంచాయతీలో విలీనం చేయడం సరికాదంటూ కోర్టుకు వెళ్లాయి. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల ఏలుబడిలోనే కొనసాగుతోంది.

ఫ నాలుగేళ్ల కిందట(2021లో) వైసీపీ హయాంలో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రత్యేక తీర్మానాలు చేయించి మునిసిపాల్టీగా అప్‌గ్రేడ్‌ చేసి ఎన్నికలకు సిద్ధపడ్డారు. అప్పుడు కూడా ఆయా పంచాయతీలు వ్యతిరేకించాయి. మునిసిపాల్టీలో విలీనం అయితే ఉపాధి హామీ పథకం నిలిచిపోతుందని.. పన్నుల భారంతో సతమతమవుతామని చెప్పి మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి ఎన్నికల జోలికి వెళ్లలేదు.

ఫ 20 ఏళ్లలో పాలకవర్గం లేక ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్‌ పడింది. ప్రత్యామ్నాయ రూపంలో నిధులు తెచ్చుకోవడం తప్ప.. నేరుగా వచ్చిన దాఖలాలు లేవు. తాజాగా పంచాయతీల విలీనం, మార్పులకు సంబంధించి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆ మూడు పంచాయతీల్లో ప్రజాభిప్రాయం చేపట్టే అవకాశం ఉంది. అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఏం జరుగుతుందో చూడాలి.

శుభ పరిణామం

ప్రభుత్వం పంచాయతీ విలీన ప్రక్రియపై ఉన్న నిషేధాన్ని తొలగించడం శుభ పరిణామం. ఆ మూడు పంచాయతీల అభిప్రాయాన్ని తీసుకొని ఎన్నికలకు వెళితే సరిపోతుంది. ఇప్పటివరకూ ఉన్న న్యాయచిక్కులన్నీ తొలగిపోతాయి. ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది.

- గురవాన నారాయణరావు, టీడీపీ నేత, రాజాం

మంచి నిర్ణయం తీసుకోవాలి

20 ఏళ్లుగా పాలకవర్గం లేక రాజాం మునిసిపాల్టీ అన్నివిధాలా నష్టపోయింది. ఎన్నికలు నిలిచిపోవడానికి విలీన పంచాయతీలకు సంబంధించి న్యాయ చిక్కులే కారణం. ఇకనైనా యంత్రాంగం ప్రజల మనోభావాలకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటే మంచిది.

నంది సూర్యప్రకాష్‌రావు, రాజాం

Updated Date - Dec 18 , 2025 | 12:12 AM