నిధులు మంజూరైనా.. నత్తనడకనే!
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:44 PM
కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాల పనులు ఊపందుకోవడం లేదు.
- పూర్తికాని కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఆసుపత్రుల పనులు
- మార్చి నాటికి నూతన భవనాలు అప్పగిస్తామన్న అధికారులు
- రోగులను వేధిస్తున్న వసతి సమస్య
జియ్యమ్మవలస, సెప్టెంబరు11(ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాల పనులు ఊపందుకోవడం లేదు. ప్రభు త్వం బిల్లులు చెల్లిస్తున్నా.. నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మరో వైపు రోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవంగా 50 పడకలున్న ఆయా సీహెచ్‌సీ లకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిత్యం వైద్య సేవల కోసం దూర ప్రాంతాల నుంచి గిరిజనులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రుల పాత భవనాల్లో వైద్య సేవలు అందిస్తున్నా.. మౌలిక వసతుల కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న వారు ఏదో ఒక చోట సర్దుకుని వైద్య సేవలు పొందాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
గత వైసీపీ ప్రభుత్వం.. కురుపాం ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రూ.3 కోట్లు, గుమ్మలక్ష్మీపురం సీహెచ్‌సీ పనులకు రూ. 8.95 కోట్లు మంజూరు చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఇంజనీరింగ్ విభాగానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే సకాలంలో బిల్లులు అందకపోవడంతో పనులు నత్తనడకన జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ బిల్లులు చెల్లించింది. ఆ తర్వాత చేపట్టిన పనులకూ చకచకా బిల్లులు చెల్లిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నాటికి ఆ రెండు భవనాలను జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారులకు అప్పగించాల్సి ఉంది. అయితే నేటికీ అందుబాటులోకి రాకపోగా.. ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా విద్యుత్‌శాఖ చేయాల్సిన పనులే మిగిలి ఉన్నాయంటున్నారు. ఏదేమైనా నూతన భవనాలను త్వరగా వినియోగంలోకి తేవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఏపీఎంఎస్‌ఐడీసీ డీఈఈ ప్రసన్నకుమార్‌ను వివరణ కోరగా.. ‘ఆసుపత్రుల నూతన భవన నిర్మాణాలు పూర్తి చేసేశాం. ఇంకా విద్యుత్‌కు సంబంధించిన పనులు ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయిస్తాం.’ అని తెలిపారు.