కార్తీకం ముగిసినా తగ్గలే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:11 AM
కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి.
- దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు
- కిలో వంకాయలు రూ.80, పందిరి చిక్కుడు రూ.100
- సామాన్య, మధ్యతరగతి ప్రజల బెంబేలు
విజయనగరం రూరల్/కల్చరల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60 నుంచి రూ.80 పలుకుతోంది. మరికొన్ని ధరలు రూ.100 నుంచి రూ.120 ఉన్నాయి. కార్తీకమాసం ముగిసినా కూరగాయల ధరలు తగ్గకపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కిలో కొనాల్సిన వారు పావు, అర కిలోతో సరిపెట్టుకోవలసి వస్తుంది. బహిరంగ మార్కెట్‌లో టమోటా కిలో రూ.60 నుంచి రూ.70, వంకాయలు రూ.80, బీరకాయలు రూ.60 నుంచి రూ.65, పందిరి చిక్కుడు రూ.120, అరటి కాయ ఒకటి రూ.15, ఉల్లి రూ.25, బంగాళదుంపలు కిలో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. నాలుగైదు రకాల కూరగాయాలను కొనుగోలు చేయాల్సిన వినియోగదారులు వాటి ధరలను చూసి ఒకట్రెండు రకాల కూరగాయలతో సరిపెట్టుకుంటున్నారు.
రైతు బజార్లలో కొంత తక్కువ..
విజయనగరంలో మూడు రైతు బజార్లు ఉన్నాయి. ఇక్కడ కూరగాయలను బయట మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమోటా రూ.49, వంకాయలు రూ.60, బీరకాయలు రూ.55, పందిరి చిక్కుడు రూ.92 వుండగా, అరటికాయ ఒకటి రూ.10, ఉల్లి, బంగాళ దుంపలు కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. బయట మార్కెట్, రైతు బజారు ధరల మధ్య కిలోకి రూ.10 నుంచి రూ.20 వరకు వ్యత్యాసం ఉంటుంది.
తగ్గిన ఉత్పత్తి..
జిల్లాలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడంతో ఉత్పత్తి తగ్గింది. ఒకప్పుడు విజయనగరంలోని మూడు రైతు బజార్లకు వివిధ రకాల కూరగాయలు 300 నుంచి 350 క్వింటాళ్లు వచ్చేవి. ప్రస్తుతం 100 నుంచి 150 క్వింటాళ్ల వరకే వస్తున్నాయి. ఆకుకూరలు ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు. వీటన్నింటికీ వర్షాలే కారణమని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం ధరలపై పడింది. ప్రస్తుతం కూరగాయల సాగు ప్రారంభ దశలో ఉంది. డిసెంబరు ఆఖరు నాటికి కొన్ని పంటల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ తుఫాన్ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.