Share News

Even if caught, but will not stop. పట్టుబడుతున్నా ఆగట్లే

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:11 AM

Even if caught, but will not stop. రైలులో ముగ్గురు వ్యక్తులు గంజాయి తీసుకువస్తున్నారని పోలీస్‌లకు సమాచారం అందడంతో విజయనగరం రైల్వేస్టేషన్‌ వద్ద మాటు వేశారు. రైలు దిగి ట్రాలీ సూట్‌ కేసులను నడుపుకుంటూ వస్తున్న వారిని అనుసరించి సమీపంలోని లాడ్జి వద్ద అడ్డుకుని తనిఖీ చేశారు.

Even if caught, but will not stop. పట్టుబడుతున్నా ఆగట్లే
ఎస్‌.కోట మండలం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులకు వ్యాన్‌లో పట్టుబడిన గంజాయి

పట్టుబడుతున్నా ఆగట్లే

జిల్లా మీదుగా తరలిపోతున్న గంజాయి

ఆస్తులు సీజ్‌ చేస్తున్నా వెరవని స్మగ్లర్‌లు

వేర్వేరు మార్గాలపై దృష్టి

తప్పించుకుంటున్న సూత్రదారులు

- రైలులో ముగ్గురు వ్యక్తులు గంజాయి తీసుకువస్తున్నారని పోలీస్‌లకు సమాచారం అందడంతో విజయనగరం రైల్వేస్టేషన్‌ వద్ద మాటు వేశారు. రైలు దిగి ట్రాలీ సూట్‌ కేసులను నడుపుకుంటూ వస్తున్న వారిని అనుసరించి సమీపంలోని లాడ్జి వద్ద అడ్డుకుని తనిఖీ చేశారు. సూట్‌ కేసులను తెరిచి చూడగా 30 కిలోల గంజాయి ఉంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆ ముగ్గురు గంజాయిని జిల్లా మీదుగా హైదరాబాద్‌కు తరలించనున్నట్లు పోలీస్‌ విచారణలో తేలింది.

- ఒడిశా నుంచి మూడు కార్లలో గంజాయి తరలిస్తున్నట్లు భోగాపురం పోలీస్‌లకు సమాచారం వచ్చింది. రాజాపులోవ కూడలి వద్ద ఆపి తనిఖీ చేశారు. 120 కిలోల గంజాయి బయటపడింది. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో కార్లలో విశాఖ వెళ్లాక అక్కడ నుంచి రైలులో ఢిల్లీకి చేర్చాలనుకున్నట్లు విచారణలో తేలింది.

- ఒడిశా నుంచి గంజాయిని జిల్లా మీదుగా తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు చింతలవలస ఐదో బెటాలియన్‌ గేట్‌ సమీపంలో ఇటీవల డెంకాడ పోలీస్‌లు వాహన తనిఖీ పేరుతో నిఘా పెట్టారు. అటుగా వచ్చిన ఓ కారులో గంజాయి ఉన్నట్లు ముందే తెలియడంతో క్షణ్ణంగా పరిశీలించారు. 37.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని విశాఖ తరలిస్తున్నట్లు పట్టుబడిన నిందితులు విచారణలో తెలిపారు.

- శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్‌ పోస్టు వద్ద మంగళవారం పోలీస్‌లు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ వ్యాన్‌లో గంజాయి పట్టుబడింది. 120 కేజీల నుంచి 150 కేజీల వరకు ఉంటుందని అంచనా. తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్‌లు విచారిస్తున్నారు. తూకం వేస్తే తప్ప ఖచ్చితమైన లెక్క చెప్పడం కష్టం.

శృంగవరపుకోట, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లా మీదుగా గంజాయి రవాణా ఆగడం లేదు. ఎక్కడికక్కడే పోలీసులు చాకచక్యంగా పట్టుకుంటున్నా స్మగ్లర్లు తగ్గడం లేదు. ఆస్తులను ప్రభుత్వ పరం చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా భయం లేకుండా తమ పంథా కొనసాగిస్తున్నారు. సూత్రదారులు దొరక్కపోవడమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. అమాయకులు, యువకులు స్మగ్లర్ల గాలానికి చిక్కి డబ్బుల కోసం ఆశపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఓ స్మగ్లర్‌ ఆస్తులను జిల్లా పోలీసులు ప్రభుత్వ పరం చేశారు. అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగించడానికి వెనకాడడం లేదు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతగా పోలీస్‌లు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి రవాణా ఆగడం లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే పోలీస్‌ల కళ్లుగప్పి దొడ్డిదారుల్లో ఇంకెంత గంజాయి తరలిపోతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం గంజాయి రవాణాను పట్టించుకోలేదు. దీంతో జిల్లా మీదుగా విచ్చలవిడిగా వివిధ రాష్ట్రాలకు తరలించారు. స్థానిక యువత గంజాయి సేవించేందుకు అలవాటు పడ్డారు. చాలా గ్రామాల్లో గంజాయికి బానిసలైన వారున్నారు. యువకులు పట్టుబడినప్పుడు స్థానిక పెద్దలు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగి బ్రతిమలాడుతున్నారు. జైలు జీవితం గడిపితే భవిష్యత్‌ నాశనమవుతుందని కోరడంతో పోలీస్‌లు హెచ్చరించి మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తుండంతో పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. పోలీస్‌లు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే చాలా వరకు జైలులో వీరే ఉంటారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా విశాఖ-అరకు రోడ్డునే గంజాయి రవాణాకు ఎంచుకొనేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి రవాణాను అడ్డుకుంటోంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎస్‌.కోట మండలంలో బొడ్డవర చెక్‌ పోస్టు వద్ద భద్రత పెంచారు. అరకు నుంచి విశాఖకు వెళ్లే ప్రతి వాహనంపై ప్రత్యేక నిఘా పెట్టారు. బొడ్డవర చెక్‌ పోస్టు సమీపం నుంచి ఉన్న అడ్డదారులను కట్టడి చేశారు. దీంతో గంజాయి రవాణాదారులు రూట్‌ మార్చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంగా ఉన్న హైవేపై దృష్టి పెట్టారు. ఇటీవల దొరికన గంజాయి కేసులను బట్టి ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అరకు పర్యాటక ప్రాంతానికి ఆనుకుని ఒడిశా ఉంది. ఈరెండింటి సరిహద్దులో గంజాయిని పండిస్తున్నారు. గిరిజన రైతులకు పెట్టుబడి అందిస్తున్నారు. ఆపై అరకు మీదుగా వివిధ దారుల్లో తీసుకుపోతున్నారు. ఇతర రాష్ట్టా్ట్రలకు చేరుకొనేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌ను వాడుకుంటున్నారు. ఈ స్టేషన్‌కు చేరుకొనేందుకు విశాఖ-అరకు రోడ్డు అనువుగా లేనప్పుడు జిల్లా కేంద్రం నుంచి హైవే మీదుగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా పోలీస్‌లు చాలా వరకు పట్టుకుంటున్నప్పటికీ ఈ దందా ఆగడం లేదు.

Updated Date - Jul 31 , 2025 | 12:11 AM