Share News

Still Not Given! ఎనిమిది నెలలైనా.. ఇవ్వలే!

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:41 PM

Even After Eight Months.. Still Not Given! జిల్లాలో చౌక ధరల దుకాణాలకు డీలర్లుగా ఎంపికైన వారికి ఇంకా నియామక పత్రాలు అందలేదు. ఫలితాలు వెలువడి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. నేటికీ ఉత్కంఠ వీడడం లేదు. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వడం లేదు.

 Still Not Given!  ఎనిమిది నెలలైనా.. ఇవ్వలే!

  • సబ్‌ కలెక్టర్ల బదిలీలతో మరింత ఆందోళన

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

గరుగుబిల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చౌక ధరల దుకాణాలకు డీలర్లుగా ఎంపికైన వారికి ఇంకా నియామక పత్రాలు అందలేదు. ఫలితాలు వెలువడి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. నేటికీ ఉత్కంఠ వీడడం లేదు. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వడం లేదు. తాజాగా పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లకు బదిలీలైన నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు జిల్లాలో నియామక పత్రాలు ఇచ్చినా.. ఇక్కడెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలో డీలర్ల నియామానికి గత ఏడాది డిసెంబరు 9న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదేనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 19న దరఖాస్తులను పరిశీలించారు. పార్వతీపురం డివిజన్‌లో 36 డిపోలకు గాను గరుగుబిల్లి, కొమరాడ, మక్కువ, బలిజిపేట, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాల నుంచి 285 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 63 తిరస్కరణకు గురయ్యాయి. పాలకొండ డివిజన్‌లో 20 చౌక ధరల దుకాణాలకు 64 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 56 డీలర్ల పోస్టులకు 266 మంది పోటీ పడ్డారు. సంబంధిత అభ్యర్థులకు డిసెంబరు 21న మౌఖిక పరీక్షకు హాల్‌ టిక్కెట్లు జారీ చేశారు. వీరికి 23న పరీక్ష నిర్వహించి 26న ఫలితాలను ప్రకటించారు. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి 28న మౌఖిక పరీక్ష నిర్వహించారు. 30న ఫలితాలు ప్రకటించారు. 56 దుకాణాలకు అర్హత పొందిన వారి జాబితాను జనవరి 10న వెలువడించారు. ఎంపికైన వారి జాబితాలను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపించారు. వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను అందించారు. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నియామక పత్రాలను అందించలేదు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో పలువురికి నియామక పత్రాలు అందించినా ఈ ప్రాంతంలో మాత్రం అందించలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు 8 నెలలుగా వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పీజీఆర్‌ఎస్‌లోనూ వినతులు అందిస్తున్నారు. నియామక పత్రాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. తాజాగా సబ్‌ కలెక్టర్ల బదిలీలతో వారిలో మరింత అలజడి నెలకొంది. ఏ కారణంతో ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతుండగా.. సంబంధిత నియోజకవర్గాల ప్రతినిధులు మాత్రం నోరుమెదపడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని డీలర్లుగా ఎంపికైన వారు కోరుతున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:41 PM