పంట నష్టం అంచనా వేయండి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:18 AM
‘భారీ వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు ఏ మేరకు నష్టం జరిగిందో గ్రామాల వారీగా సర్వే చేపట్టండి. పంట నష్టం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపండి.’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.
- తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
- మంత్రి సంధ్యారాణి
మక్కువ రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘భారీ వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు ఏ మేరకు నష్టం జరిగిందో గ్రామాల వారీగా సర్వే చేపట్టండి. పంట నష్టం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపండి.’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. శంబర సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్టును ఆమె గురువారం సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో, నదుల్లోకి విడిచిపెడుతున్న వరద నీటి సమాచారాన్ని డీఈ సురేష్, ఏఈను అడిగి తెలుసుకున్నారు. వరద నీటితో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆమె సువర్ణముఖి క్రస్ట్ గేటు వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకొని, అన్నివిధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే సమాచారాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రేషన్ లబ్ధిదారులు అడిగితే బియ్యాన్ని ముందస్తుగానే అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నదులు, కాజ్‌వేల వద్ద ప్రజలు ప్రమాద పరిస్థితిలో ప్రయాణాలు సాగించకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న పేదలు, గిరిజనులకు అధికారులు నిత్యావసరాలు అందించాలన్నారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దని అన్నారు. తుఫాన్‌తో గ్రామాలు అపరిశుభ్రంగా మారాయని, ప్రజలకు ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యసహాయం అందించాలని, అవసరమైతే ప్రత్యేక వైద్యశిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోయినా, విరిగిపోయినా వాటిస్థానంలో వెంటనే కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ సరఫరా జరగేలా చూడాలన్నారు. తుఫాన్ నష్టాలను అఽధికారులు సక్రమంగా నమోదు చేయకపోయినా, నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందకపోయినా 1912, 100, 101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని ప్రజలకు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ కె.భరత్‌కుమార్, ఎంపీడీవో అర్జున్‌రావు, మండల వ్యవసాయశాఖాధికారి చింతల భారతి, టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు, తదితరులు ఉన్నారు.