Implementation పక్కాగా అమలు చేయండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:34 PM
Ensure Strict Implementation సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ముస్తాబు, విద్యాప్రగతి వంటి కార్యక్రమాలను పక్కాగా అమలుచేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు.
సీతంపేట రూరల్, డిసెంబరు18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ముస్తాబు, విద్యాప్రగతి వంటి కార్యక్రమాలను పక్కాగా అమలుచేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. జగతిపల్లి, పొల్ల వ్యూపాయింట్, సున్నపు గెడ్డ జలపాతం, చంద్రమ్మతల్లి ఆలయాన్ని గురువారం పరిశీలించారు. ఈ పర్యాటక ప్రదేశాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటకుల కోసం వెదురుతో బెంచీలు ఏర్పాటు చేసి, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని స్పష్టంచేశారు. అనంతరం జగతిపల్లిలో జీపీఎస్ పాఠశాలను సందర్శించారు. అక్కడ చదువుతున్న చిన్నారులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో భోదించాలని ఉపాధ్యాయులను ఇన్‌చార్జి పీవో ఆదేశించారు. అక్కడి నుండి పెద్దపొల్ల గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులు చదువుల్లో రాణించి పాఠశాల, తల్లిదండ్రులకు పేరుతీసుకురావాలని సూచించారు. మెనూ పక్కాగా అమలుచేయాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. అదే గ్రామంలో సచివాలయాన్ని పరిశీలించి.. రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అక్కడి నుంచి గడిగుజ్జి గ్రామానికి చేరుకుని రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు.
ధాన్యం నిల్వలపై సబ్ కలెక్టర్ ఆరా
పాలకొండ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మండలం నవగాం సమీపంలోని తెట్టంగి రహదారిలో నిల్వ ఉంచిన ధాన్యంపై గురువారం రాత్రి సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆరా తీశారు. సంబంధిత ధాన్యం నిల్వలపై పూర్తి వివరాలను అందించాలని పాలకొండ, వీరఘట్టం తహసీల్దార్లను ఆదేశించారు. దళారులు ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని, అప్పటివరకు ధాన్యం నిల్వలు అక్కడ నుంచి తరలిపోకుండా చూడాలని ఆదేశించారు.