encrochements by some persons గెడ్డపై గెద్దలు
ABN , Publish Date - May 28 , 2025 | 12:29 AM
encrochements by some persons లక్కవరపుకోట మండలంలో అతిపెద్దదైన మార్లాపల్లి పంట కాలువకు ప్రమాదం మంచుకొస్తోంది. ఈ కాలువకు నీరు వచ్చే కోటవానిచెరువు గెడ్డ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర గెడ్డపొడవునా ఆక్రమణలు ఉన్నాయి.
గెడ్డపై గెద్దలు
‘కోటవాని’లో 16 ఎకరాలు ఆక్రమణ
గుట్టుగా చదును చేసిన వైనం
లక్కవరపుకోట, మే 27(ఆంధ్రజ్యోతి): లక్కవరపుకోట మండలంలో అతిపెద్దదైన మార్లాపల్లి పంట కాలువకు ప్రమాదం మంచుకొస్తోంది. ఈ కాలువకు నీరు వచ్చే కోటవానిచెరువు గెడ్డ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర గెడ్డపొడవునా ఆక్రమణలు ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు గెడ్డలో పొదలను కొట్టేసి మొక్కులు పెంచే ఎత్తుగడ వేశారు. 16 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో తోటలు వేసేందుకు దుక్కలు కూడా పూర్తి చేశారు. అధికారులు చూడరని ప్రతీ ఆదివారం యంత్రాలతో పనులు చేస్తున్నారు. వారి చర్యలతో దాదాపుగా గెడ్డ కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. కొద్ది స్థలాన్ని మాత్రమే వదిలి మిగతా గెడ్డను ఆక్రమించేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మార్లాపల్లి సాగునీటి కాలువ మూతపడాల్సిందే. వందల ఎకరాలకు సాగునీరు రానట్టే.
కోటవానిచెరువుకు చాలా చరిత్ర ఉంది. పూర్వం రాజుల పాలనలో కోటయ్య అనే వ్యక్తి తన ఆవుల మందను ఈ చెరువు వద్ద ఉంచి కొన్నేళ్లపాటు జీవనం సాగించాడని, ఆయన పేరుతో ఈ చెరువు వెలిసిందని పూర్వీకుల మాట. శ్రీరాంపురం రెవెన్యూ సర్వే నెంబరు 49లో 38.08 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో కోటవాని చెరువు ఉంది. దీనికి సొంతంగా 88 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు నిండాక చప్టా నుంచి బయటకు వచ్చే మిగులు నీళ్లు నాలుగు కిలోమీటర్ల మేర గెడ్డ రూపంలో ప్రవహిస్తాయి. ఈ మధ్యలోనే మార్లాపల్లి కాలువను పూర్వీకులు నిర్మించారు. గెడ్డ సర్వే నెంబరు 1, 27, 39, 40లలో వంద అడుగుల వెడల్పు నుంచి 200 అడుగుల వెడల్పున ఉంది. దీనిపై కబ్జాదారుల కళ్లు పడ్డాయి. సాగునీటినీ సులువుగా వాడుకోవచ్చునని ఏకంగా గెడ్డలోనే తోటలు పండించుకోవాలనుకుంటున్నారు.
- కోటవాని చెరువుకు నీటి రాక విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం పిండ్రంగి కొండల వద్ద మొదలైంది. ముసిరాం, రేగ, కల్లేపల్లి, తామరాపల్లి గ్రామ రెవెన్యూలలో సుమారు 16 కిలోమీటర్ల మేర ప్రవహించి వందలాది ఎకరాలకు నీరందిస్తూ కోటవాని చెరువులోకి వస్తోంది. అక్కడ నుంచి మార్లాపల్లి చానల్ ద్వారా వేల ఎకరాలకు నీరు అందిస్తూ జమ్మాదేవిపేట, రంగాపురం, ఎల్.కోట మీదుగా ఖాసాపేటకు చేరుకుంటుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న గెడ్డ మూతపడితే బతికేదెలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణదారులందరిపై చర్యలు తీసుకోవాలని, గెడ్డ ఆధునికీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
- కోటవానిచెరువు గెడ్డ శ్రీరాంపురం రెవెన్యూకు చెందినది. విచిత్రమేమంటే ఆక్రమణదారులంతా వేరే గ్రామాలకు, పట్టణాలకు చెందినవారు కావడం. దీనిపై తహసీల్దార్ ప్రసాదరావును వివరణ కోరగా కోటవానిచెరువుగెడ్డ ఆక్రమణ తన దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి ఆక్రమణలుంటే చర్యలు తీసుకుంటామన్నారు.