Share News

Encouraging student talent విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:25 AM

Encouraging student talent షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తోందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేశారని హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

Encouraging student talent విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం
విద్యార్థినికి షైనింగ్‌ స్టార్స్‌ పురస్కారాన్ని అందజేస్తున్న మంత్రి అనిత, ఎమ్మెల్యేలు అదితి, నాగమాధవి, కలెక్టర్‌ అంబేడ్కర్‌

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం

షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమం లోకేశ్‌ మదిలోనిది

విద్యార్థులారా! నేర ప్రవృత్తి వైపు వెళ్లొద్దు

పోక్సో చట్టాలు గట్టిగా అమలవుతున్నాయ్‌

హోంశాఖ మంత్రి అనిత

విజయనగరం/ విజయనగరం రూరల్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తోందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేశారని హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. జిల్లాలో 200 మందికి షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం ద్వారా ప్రతిభా పురస్కారాలను సోమవారం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో అందజేశారు. ఒక్కొక్కరికీ రూ.20 వేల నగదు, జ్ఞాపిక, ప్రోత్సాహక సర్టిఫికెట్‌ను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ, షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో రానున్న కాలంలో మరిన్ని మంచి ఫలితాలు రానున్నాయన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్‌ ఎన్నో సంస్కరణలు చేపట్టి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి జరుగుతున్నదన్నారు. విద్యతో పాటు క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులంతా భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని దుర్ఘటనల్లో దోషులకు వెంటనే శిక్షలు పడుతున్నాయని, అటువంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. పోక్సో చట్టం చాలా గట్టిగా ఉందని, ఈ చట్టం కింద కేసు నమోదైతే ఏడాది వరకూ బెయిల్‌ రాదని, ఆ తరువాత కూడా ఆ విద్యార్థి జీవితం నాశనమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులంతా మంచి ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ప్రతిభావంతులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి ప్రోత్సహించడమనేది గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ, విద్య, ఉద్యోగం, ఉపాధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకుని, మంచి నడవడికతో సమాజంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని సూచించారు. కలెక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ, షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని, దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌, కళాశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూల్స్‌, కళాశాలల్లో బోధన సాగుతోందని, ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ, విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు మాట్లాడుతూ, షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ విధంగా ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది? ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహంతో మరింత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఇంటర్‌ విద్యాశాఖాధికారి తవిటినాయుడు, సర్వశిక్షాఅభియాన్‌ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులతో కలసి రాష్ట్ర మంత్రి అనిత, జిల్లా కలెక్టరు అంబేడ్కర్‌ తదితరులు భోజనం చేస్తూ, వారితో మాట్లాడారు. విద్యార్థులు ఎంతో ఆనందపడ్డారు.

మంచి ప్రొత్సాహం

పి మధుప్రియ, భోగాపురం

షైనింగ్‌ స్టార్స్‌ అనే పేరు బాగుంది. మాలాంటి విద్యార్థినీ, విద్యార్థులకు ఇది ఒక ప్రొత్సాహక కార్యక్రమం., భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. నేను కష్టపడి చదివాను. మంచి మార్కులు సంపాదించాను. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, ఈ షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం ద్వారా పురస్కారాన్ని అందుకోవడం ద్వారా మా ఊరికి మంచి పేరొచ్చింది. నాకు ఆనందంగా వుంది.

===

ఎంతో ఆనందంగా వుంది

లలిత

షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం ద్వారా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా వుందంటూ ఆమె మైకు ముందు మాట్లాడలేకపోయింది. వెంటనే వేదిక మీద వున్న రాష్ట్ర హోంమంత్రి అనిత తన వద్దకు ఆ విద్యార్థినీ పిలిపించుకుని, ఏ విధంగా మాట్లాడాలో ఆమెకు వివరించారు. వెంటనే ఆ విద్యార్థి, ‘షైనింగ్‌ స్టార్‌ కార్యక్రమం గురించి, అదే విధంగా ప్రభుత్వ ప్రొత్సాహం, షైనింగ్‌ స్టార్‌ ఎంపిక కావడానికి వెనుక వున్న కృషి తదితర విషయాలను లలిత వెల్లడించారు.

Updated Date - Jun 10 , 2025 | 12:25 AM