Share News

Tourism! పర్యాటకానికి ప్రోత్సాహం!

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:45 PM

Encouragement to Tourism! సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కుకు రూ.1.50కోట్లు, గిరిజన మ్యూజియంకు రూ.కోటి మొత్తం రూ.2.50కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.

 Tourism!   పర్యాటకానికి ప్రోత్సాహం!
సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌

రూ.2.50 కోట్లు విడుదల

ఎన్టీఆర్‌ పార్కుకు కొత్త హంగులు

గిరిజన మ్యూజియం పనులు ముందుకు...

హర్షం వ్యక్తం చేస్తున్న ఆదివాసీలు

సీతంపేట రూరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కుకు రూ.1.50కోట్లు, గిరిజన మ్యూజియంకు రూ.కోటి మొత్తం రూ.2.50కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ నిధులను ఈఐ (ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) గ్రాంట్‌ నుంచి విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఈ నిధులతో సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలకు కొత్త హంగులు సంతరించుకోనున్నాయి. దీంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన మ్యూజియం..

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, ఆహారపు అలవాట్లు ఉట్టిపడేలా గిరిజన మ్యూజియం ఏర్పాటుకు 2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక నిధు లు కేటాయించింది. రూ.35లక్షలతో వివిధ పనులు ప్రారంభమయ్యాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది.నిధులు వెచ్చించక పోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మ్యూజియం పనులు పూర్తిచేయాలని గిరిజన సంఘాలు ఎన్నోసార్లు అప్పట్లో విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేస్తుండడంతో మ్యూజియం నిర్మాణ శరవేగంగా జరగనుంది. మ్యూజియంలో గిరిజన కళాకృతులు, ఇంటీరియల్‌, ఫ్రంట్‌ ఎలివేషన్‌తో పాటు మరికొన్ని హంగులను తీర్చిదిద్దనున్నారు.

పార్కులో కొత్త ఈవెంట్లు..

సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కుకు ప్రభుత్వం రూ.1.50కోట్లు నిధులు విడుదల చేస్తుంది. దీంతో పార్కుకు కొత్తదనం సంతరించుకోనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ పార్కులో పలు సాహస క్రీడలు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పర్యాటక ప్రాంత అభివృద్థిని గాలికొదిలేసింది. అడ్వంచర్‌ పార్కులో పర్యాటకుల కోసం కొత్తరకాల ఈవెంట్లు అందుబాటులోకి తీసుకురాలేదు. దీనివల్ల పార్కుకు కొంతవరకు ఆదరణ తగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అడ్వంచర్‌ పార్కు అభివృద్ధికి రూ.1.50కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పార్కులో స్విమ్మింగ్‌ ఫూల్‌ విత్‌ స్లైడ్స్‌, గిరి గ్రామదర్శిని, డ్రైవిన్‌, రెయిన్‌డాన్స్‌, సన్‌ అండ్‌ మూన్‌రైడ్‌, 360 డిగ్రీల సైకిల్‌రైడ్‌, మెరీ కోలం బస్‌రైడ్‌, తొర తొర రైడ్‌, హెలీకాఫ్టర్‌ రైడ్‌, పండా ట్రైన్‌రైడ్‌, స్ర్టైకింగ్‌ కార్సురైడ్‌, మినీ టవర్‌రైడ్‌, మెల్ట్‌ డౌన్‌ రైడ్‌ వంటి సాహసోపేతమైన క్రీడల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపారు. ఇవి ఏర్పాటైతే ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కుకు సందర్శకులు తాకిడి మరింత పెరగనుంది. తద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఐటీడీఏకు ఆదాయం చేకూరనుంది.

నిధులు వచ్చిన వెంటనే పనులు..

నిధులు వచ్చిన వెంటనే పార్కులో కొత్త ఈవెంట్లను ఏర్పాటు చేస్తాం. గిరిజన మ్యూజియం పనులు కూడా ప్రారంభించి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. వీటి అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ (డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)ను కూడా ప్రభుత్వానికి పంపాం.

-సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి పీవో, ఐటీడీఏ, సీతంపేట

Updated Date - Aug 10 , 2025 | 11:45 PM