Share News

‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:43 PM

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు.

‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

- కూలీలకు కనీస వేతనం అందించాలి

- కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో డ్వామా, ఇంజనీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన కోటి 33 లక్షల పని దినాల లక్ష్యాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. కూలీలకు కనీస రోజువారి వేతనం రూ.307 అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్‌ పనులకు సంబంధించి 75శాతానికి పైగా ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఐసీడీఎస్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత భవనాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్ల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు లేని అద్దె భవనాలు ఉంటే వెంటనే మార్పు చేయాలన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ విమలరాణి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన జిందాల్‌ నిర్వాసితులు

జిందాల్‌ భూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని కలెక్టర్‌ అంబేద్కర్‌ హామీ ఇచ్చారు. లోకసత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి, కిల్తపాలం, మూలబొడ్డవర గ్రామాలకు చెందిన 10 మంది రైతులు శనివారం కలెక్టర్‌ను కలిశారు. తమ భూములకు సంబంధించి జిందాల్‌ యాజమాన్యం ఇప్పటి వరకు తమకు పరిహారం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ మురళిని విచారణ అధికారిగా నియమించారు. విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Jul 19 , 2025 | 11:43 PM