Share News

బాధను దిగమింగి.. బిడ్డల కోసం శ్రమిస్తూ..

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:51 PM

రమణమ్మా..వేడినీళ్లు పెట్టు... జయమ్మా.. ఆ డ్రెస్సులు కాస్త మడత పెట్టు...కాస్త ఇంటిముందు ముగ్గు వేసెయ్‌... ఉదయం వేళల్లో అనేక ఇళ్లలో నిత్యం ఇలాంటి మాటలు వినడం మనకు అలవాటే.

బాధను దిగమింగి.. బిడ్డల కోసం శ్రమిస్తూ..
ఓ ఇంట్లో అంట్లు తోముతున్న సునీత

భర్త చనిపోయినా పిల్లలను పోషించుకుంటున్న తల్లి

ఇళ్లల్లో పనిచేస్తూ వారిని ఉన్నత చదువులు చదివిస్తున్న వైనం

ఆదర్శంగా సునీత

నేడు అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం

సాలూరు రూరల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి ): రమణమ్మా..వేడినీళ్లు పెట్టు... జయమ్మా.. ఆ డ్రెస్సులు కాస్త మడత పెట్టు...కాస్త ఇంటిముందు ముగ్గు వేసెయ్‌... ఉదయం వేళల్లో అనేక ఇళ్లలో నిత్యం ఇలాంటి మాటలు వినడం మనకు అలవాటే. ఆ రమణమ్మలు..జయమ్మలు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుంటామో ఇల్లాళ్లు చెబుతుండడమూ మనకు తెలిసిందే. ఇలా ఇంటి అవసరాలన్నీ తీర్చే వారే గృహ కార్మికులు. మరో ఇంటిలో రెక్కలు ముక్కలుగా చేసుకొని కష్టపడే గృహ కార్మికుల శ్రమ వెనుక కనిపించని కష్టాలు..కన్నీళ్లు ఎన్నో. అంతేకాదు..ఇలా కష్టపడుతూనే తమ బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దిన వారూ ఎందరో ఉన్నారు. సోమవారం అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా కథనం.. సాలూరుకు చెందిన పిట్టా సునీత అనే మహిళ పలువురి ఇళ్లల్లో కార్మికురాలుగా పనిచేస్తోంది. ఆమె భర్త పిట్టా నాగరాజు రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త చనిపోక ముందు నుంచే కుటుంబ పోషణ కోసం ఆమె పలువురి ఇళ్లల్లో పని చేయడం ప్రారంభించింది. ఇళ్లల్లో పనిచేస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తోంది. కుమారుడు గోవర్థన్‌ ఐటీఐ పూర్తి చేశాడు. ఇటీవల డీజిల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమ పట్టా తీసుకున్నాడు. రైల్వేలో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. కుమార్తె తేజశ్రీ ఇంటర్మీడియట్‌ చదివింది. ఇటీవల ఏపీఈపీ సెట్‌లో 30 వేలు ర్యాంకు వచ్చింది. దీంతో కన్వీనర్‌ కోటాలో ఏజీ బీఎస్సీ, ఫార్మసీ కోర్సులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ‘నా భర్త గతించారు. ఆ బాధను దిగమింగుకుంటూ పిల్లలను పోషించడానికి ఇళ్లల్లో పనులు చేయడానికి వస్తున్నాను. ఇంటి యాజమానుల మంచితనంతో కాలం వెళ్తుంది. నా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను. వితంతు పింఛను కోసం ఎదురు చూస్తున్నాను.’ అని సునీత తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 11:51 PM