elephants: ఈసారైనా కని‘కరి’స్తారా?
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:00 AM
elephants: జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనావాసాల మధ్య సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నాయి.
- ఏనుగుల తరలింపులో జాప్యం
- పునరావాస కేంద్రం పనులు నత్తనడక
- వాటి దాడిలో మృతి చెందుతున్న ప్రజలు
- పంటలు సర్వ నాశనం
- గజరాజులు కూడా మృత్యువాత పడుతున్న వైనం
జియ్యమ్మవలస, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనావాసాల మధ్య సంచరిస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నాయి. వరి, టమాటా, మొక్కజొన్న తదితర పంటలతో పాటు మోటారు ఇంజన్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులను ధ్వంసం చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లలేకపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. ఇప్పటికే గజరాజుల దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మరోపక్క ఏనుగులు కూడా ప్రమాదాలకు గురై మృత్యువాతపడుతున్నాయి. ప్రస్తుతం పాలకొండ డివిజన్‌లో ఒక గుంపు, పార్వతీపురం డివిజన్‌లో మరో గుంపు మొత్తం 14 ఏనుగులు జిల్లాలో సంచరిస్తున్నాయి. వీటి తరలింపునకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. కనీసం పునరావాస కేంద్రం పనులైనా పూర్తిచేసి ఆ ప్రదేశానికి తరలించాలని జిల్లా ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.
27 ఏళ్లుగా విధ్వంసం
1998 అక్టోబరు 2న ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అభయారణ్యం నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాం మండలం పనసభద్ర గ్రామ పరిసరాల్లోకి 11 ఏనుగులు ప్రవేశించాయి. అప్పటి నుంచే ఇవి విధ్వంసం సృష్టిస్తున్నాయి. పాలకొండ రేంజ్ పరిధిలోకి 2007లో మరో 8 ఏనుగులు ప్రవేశించాయి. ఇవీ కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగులు నాశనం చేసిన పంటలకు సంబంధించి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి న్యాయం చేయాల్సిన రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పత్తా లేకుండా పోతున్నారు. అటవీశాఖ మాత్రం తెలిసీతెలియని అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతూవస్తున్నారు. నష్టం ఎక్కువగా ఉంటున్నా పరిహారం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా చెల్లిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులతో జిల్లాలో ఇంతవరకు 27 మంది మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అలాగే వివిధ ప్రమాదాలకు గురై 11 ఏనుగులు కూడా మృత్యువాత పడ్డాయి. గత 27 ఏళ్లలో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
ఐదు చోట్ల స్థలాల పరిశీలన..
ఏనుగుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించారు. ఈ మేరకు 2010లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అటవీశాఖ అధికారులు దేశంలోని మొట్టమొదటి ఏకైక ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ (ఈసీసీసీ)ను సందర్శించారు. రిజర్వు ఫారెస్ట్ వెలుపల ఉన్న ఏనుగులను నిర్బంధించిన సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏనుగుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన ప్రారంభించారు. ఇందులో భాగంగా కొమరాడ మండలం అర్తాం రిజర్వ్ ఫారెస్ట్, పార్వతీపురం వైపు ఉన్న నాగావళి నది పరివాహక ప్రాంతం, జియ్యమ్మవలస మండలం వట్టిగెడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతం, కురుపాం మండలంలోని బోడి కొండ, మక్కువ మండలంలోని జంతి కొండ ప్రాంతాలను పరిశీలించారు. కానీ ఆ ప్రాంతాల గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో పాటు కావల్సిన భూమిని రెవెన్యూశాఖ సమకూర్చకపోవడంతో ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు నత్తనడకలా తయారయ్యింది.
పునరావాస కేంద్రంలో ఇవి ఉండాలి..
- ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు వంద నుంచి 200 హెక్టార్లతో అనువైన ప్రాంతం ఉండాలి.
- అందులో 75 నుంచి 100 హెక్టార్లు నీటి వనరులు ఏర్పాటు చేయాలి.
- మూడేళ్లకు సరిపడ ఆహారాన్ని ఏనుగులకు అందించి ఆ ప్రాంతాన్ని వాటికి అలవాటు చేయాలి.
- గడ్డి, చెరకు, పండ్ల జాతి మొక్కలను పెంచాలి. వీటితో పాటు ఇతర అటవీ జాతుల విస్తీర్ణం పెంచి అందులో ఏనుగులకు అనువైన వెదురు ఆవాసాలు పెంచాలి.
- నీటి లభ్యత పెంచడం కోసం సోలార్ బోర్లు ఏర్పాటు చేసి భారీ ఊట చెరువులు నిర్మించాలి.
- ఏనుగులు ఉండబోయే మొత్తం ప్రాంతానికి చుట్టూ ఇనుప రైలింగ్‌తో పాటు కంచె ఏర్పాటు చేసి దానికి ఇరువైపులా పెద్ద కందకాలు తవ్వాలి.
ఎట్టకేలకు సీతానగరం మండలంలో..
ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు ఎట్టకేలకు సీతానగరం మండలం గుచ్చిమి, అప్పయ్యపేట, జోగింపేట సమీపంలోని రిజర్ట్ ఫారెస్టు ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. దీని ప్రతిపాదనలు అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపగా రూ.2కోట్లు విడుదల చేశారు. అయితే, ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024-25 సంవత్సరంలో పునరావాస కేంద్ర పనులకు రూ.76 లక్షలు ఖర్చు చేశారు. 2025-26లో మిగిలినది ఖర్చు చేస్తారని అటవీశాఖ ఉన్నతాధికారి తెలిపారు. అక్కడ 40 హెక్టార్ల స్థలాన్ని పరిశీలించి ఇంకా కావల్సిన ప్రభుత్వ భూమిని రైతుల వద్ద నుంచి సమకూర్చారు. ఈ పునరావాస ప్రాంతం ఏర్పాటయితే జిల్లా వాసులకు ఏనుగుల కష్టాలు తప్పినట్లేనని అధికారులు అంటున్నారు. దీంతో పునరావాస కేంద్రం ఎప్పుడు పూర్తవుతుందోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.
4 నెలల్లో పూర్తి చేస్తాం
ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు సీతానగరం మండలం గుచ్చిమి సమీపంలో జోగింపేట, అప్పయ్యపేట గ్రామాల పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ గుర్తించాం. మరో నాలుగు నెలల్లో పునరావాస కేంద్రం పూర్తి చేస్తాం.
-మణికంఠేశ్, ఎలిఫెంట్ మోనటరింగ్ యూనిట్ అధికారి, పార్వతీపురం
కొమరాడ మండలంలో తిష్ఠ
కొమరాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు తిష్ఠవేసింది. పూజారిపేట, సిడిపల్లి గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వరి, పత్తి పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సిబ్బంది సూచిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.