Elephants లక్ష్మీపురంలో గజరాజులు
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:36 AM
Elephants in Lakshmipuram సీతానగరం మండలంలోనే గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం ఈ ప్రాంతంలోకి వచ్చిన ఏనుగులు పొలాల్లోని మోటారు పైపులు, మొక్కజొన్న బస్తాలను ధ్వంసం చేశాయి. శనివారం రాత్రి లక్ష్మీపురం పరిసరాల్లో సంచరించాయి. దీంతో స్థానికులు హడలెత్తిపోయారు.
సీతానగరం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): సీతానగరం మండలంలోనే గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. శుక్రవారం ఈ ప్రాంతంలోకి వచ్చిన ఏనుగులు పొలాల్లోని మోటారు పైపులు, మొక్కజొన్న బస్తాలను ధ్వంసం చేశాయి. శనివారం రాత్రి లక్ష్మీపురం పరిసరాల్లో సంచరించాయి. దీంతో స్థానికులు హడలెత్తిపోయారు. అవి ఎక్కడ గ్రామాల్లోకి వస్తాయోనని వారు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి లక్ష్మీపురం పక్కనే ఉన్న సువర్ణముఖి నది వైపు గజరాజులను మళ్లించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అవి తిరిగి వచ్చే అవకాశం ఉండడంతో లక్ష్మీపురం, చెల్లంనాయుడువలస, యోగోటివలస, బుడ్డిపేట గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగరాదని అటవీశాఖ అధికారులు గ్రామస్థులను హెచ్చరిస్తున్నారు.