elephants ఘీం‘కరి’ంపు కట్టడయ్యేనా?
ABN , Publish Date - May 04 , 2025 | 11:31 PM
elephants Curbed? జిల్లాలో ఏనుగుల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఎలిఫెంట్ జోన్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాలో చురుగ్గా పనులు జరుగుతున్నాయి.
వచ్చేనెల 15 లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు
ఆ తర్వాతే జిల్లాకు కుంకి.. గజరాజుల తరలింపు
ఏనుగుల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు
పార్వతీపురం, మే 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏనుగుల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఎలిఫెంట్ జోన్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాలో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. వాటి పనులు పూర్తయితే కుంకి సాయంతో మావటీల ద్వారా గజరాజులను అక్కడకు తరలించనున్నారు. దీంతో జిల్లావాసులకు దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఏనుగుల బెడద తప్పనుంది.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం డివిజన్‌లో ప్రస్తుతం ఎనిమిది ఏనుగులు సంచరిస్తున్నాయి. పాలకొండ డివిజన్ భామిని తదితర ప్రాంతాల్లో మరో నాలుగు గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. మొత్తంగా జిల్లాలో ఉన్న 12 ఏనుగులు ప్రజలు, రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి వేళల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం అవి ఏదో ఒక చోట పంటలు, సాగు పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. జనావాసాలు, ప్రధాన రహదారుల్లోనే సంచరిస్తూ... ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటకు రాలేకపోతున్నారు. పొలాలకు వెళ్లేందకు కూడా సాహంసించలేకపోతున్నారు. గజరాజుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ ప్రాంతాల నుంచి వాటిని తరలించాలని కొన్నేళ్లుగా ఏనుగు బాధిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
వైసీపీ హయాంలో..
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నెల రోజుల వ్యవధిలో కనీసం రెండు పర్యాయాలు రా ష్ట్రస్థాయి అటవీ శాఖ ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించారు. గజరాజుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పించి వెళ్లిపోయారు. ఏనుగుల దాడి ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబాలకు వైసీపీ పాలకులు నష్టపరిహారం అందించి చేతులు దులుపుకున్నారు తప్ప శాశ్వత పరిష్కార మార్గం చూపలేదు.
దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఏనుగుల కారణంగా జిల్లావాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. జిల్లాలో ఎలిఫెంట్ జోన్ పనుల కోసం నిధులు మంజూరు చేశారు. మొత్తంగా దీర్ఘకాలికంగా వేధిస్తున్న గజరాజుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించడంతో ‘మన్యం’ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ఎలిఫెంట్ జోన్ పనులు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక నుంచి జిల్లాకు కుంకి ఏనుగును తెప్పించనున్నారు. దాని సాయంతో జిల్లాలో ఉన్న 12 ఏనుగులను సీతానగరం మండలం గుచ్చిమి ప్రాంతంలో ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాకు తరలించనున్నారు.
క్రాల్ నిర్మాణం...
కుంకి సహకారంతో జిల్లాలో ఉన్న ఏనుగులను తాత్కాలిక ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాకు మావటీలు తీసుకొస్తారు. అనంతరం ప్రస్తుతం నిర్మిస్తున్న క్రాల్‌లో మూడు నెలల పాటు వాటిని ఉంచుతారు. మావటీలు చెప్పిన విధంగా ఏనుగులు నడుకునేలా శిక్షణను అందిస్తారు. ఆ తర్వాత వాటిని క్రాల్ నుంచి విముక్తి కలిగిస్తారు. సుమారు మూడు నెలల పాటు ఈ ప్రకియ జరుగుతుందని అంచనా.
గున్న ఏనుగుల కోసం షెడ్లు
జిల్లాలో గున్న ఏనుగులు మూడు ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మిస్తున్నారు. సాధారణంగా గున్న ఏనుగులు మావటీలు చెప్పిన విధంగానే నడుచుకుంటాయి. వాటి కోసం స్విమ్మింగ్‌పూల్స్ మాదిరిగా నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తొట్టెల్లో నీరు నిల్వ చేసేందుకు బోరులను సిద్ధం చేస్తున్నారు. కాగా మావటీలు ప్రతి మూడు లేదా నాలుగు రోజులకొకసారి గున్న ఏనుగులకు స్నానాలు చేయిస్తారు.
ఆహారానికి..
ఏనుగులకు ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 12 గజరాజులకు మావటీల సహకారంతో రోజూ ఆహారం అందించనున్నారు. కాగా జూన్ 15లోపు గుచ్చిమి వద్ద తాత్కాలిక ఎలిఫెంట్ హోల్డింగ్ పనులుపూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా యాంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ట్రెంచ్‌ల ఏర్పాటు...
సుమారు ఐదున్నర కిలోమీటర్లు పొడవున ట్రెంచ్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. లోతుగా ట్రెంచ్‌లు తవ్వడం వల్ల ఏనుగులు బయటకు వచ్చే అవకాశం లేదు. అవి ట్రెంచ్‌లు దాటకుండా అవసరమైన పనులు చేపడుతున్నారు. ఏనుగులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వేగవంతంగా పూర్తి
సీతానగరం మండలం గుచ్చిమి వద్ద తాత్కాలిక ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాలో చేపడుతున్న పనులను మరో 45 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రత్యేకం కమిటీ, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కుంకి సాయంతో మావటీల ద్వారా ఏనుగులను గుచ్చిమి హోల్డింగ్ ప్రాంతానికి తరలిస్తాం.
- రామ్ నరేష్, ఫారెస్ట్ రేంజర్, పార్వతీపురం