Elephants కురుపాంలో ఏనుగుల హల్‌చల్
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:17 AM
Elephant Movement in Kurupam కురుపాం గ్రామ సమీపంలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు. తొలుత ఏనుగులు సీతంపేట గ్రామం సమీపంలో సంచరించగా.. రైతులు, ఫారెస్టు ట్రాకర్లు పంటలకు నష్టం వాటిల్లకుండా శబ్దాలు చేస్తూ.. బాంబులు పేల్చారు. దీంతో ఏనుగుల గుంపు కురుపాం సమీపంలోని శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి.
కురుపాం, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): కురుపాం గ్రామ సమీపంలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు. తొలుత ఏనుగులు సీతంపేట గ్రామం సమీపంలో సంచరించగా.. రైతులు, ఫారెస్టు ట్రాకర్లు పంటలకు నష్టం వాటిల్లకుండా శబ్దాలు చేస్తూ.. బాంబులు పేల్చారు. దీంతో ఏనుగుల గుంపు కురుపాం సమీపంలోని శివ్వన్నపేట సోమసాగరం చెరువు వద్దకు చేరుకున్నాయి. వాటిని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. అటవీశాఖ సిబ్బంది వారిని అడ్డుకుని తిరిగి పంపించారు. ఇక సాయంత్రం కురుపాంలోని పాత ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి గజరాజులు చేరాయి. కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు. కురుపాం పరిసర ప్రాంతవాసులు రాత్రి పూట ఒంటరిగా బయటకు రావొద్దని వారు సూచించారు. ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నామని, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పారెస్టు సిబ్బంది తెలిపారు.