Electricity connection is not a burden విద్యుత్ కనెక్షన్ భారం ఉండదిక
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:25 AM
Electricity connection is not a burden విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతర సేవలు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ జారీ చేసిన రైట్స్ ఆఫ్ విద్యుత్ కన్స్యూమర్స్ రూల్స్ 2020కి అనుగుణంగా ఏపీఈఆర్‌సీ కొన్ని మార్పులు చేసింది.
విద్యుత్ కనెక్షన్ భారం ఉండదిక
కొత్త విధానంలో విద్యుత్ స్తంభం, వైర్ల ఖర్చు ప్రభుత్వానిదే
ట్రాన్స్‌ఫార్మర్ తిప్పలూ తప్పినట్టే
వైర్లు కిలోమీటరు దూరంలో ఉన్నా ఉచితమే
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి):
- విజయనగరం శివార్లలో నివసించే రమేష్ రెండేళ్ల క్రితం కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటికి వంద మీటర్ల దూరంలోనే కరెంటు లైను ఉన్నప్పటికీ మధ్యలో రెండు స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ అవసరమని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. వాటికోసం సుమారు రూ.లక్షా 80 వేలు అవుతుందని అంచనావేశారు. రమేష్ చివరకు అప్పు చేసి ఆ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. అప్పట్లో మౌలిక వసతుల ఖర్చు వినియోగదారుడి బాధ్యత కావడంతో ఆయనకు విద్యుత్ కనెక్షన్ పెనుభారంలా మారింది.
- విజయనగరం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాము ఇటీవల తన కొత్త నివాసానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన ఇంటి సమీపంలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు గాని లేవు. సుమారు 150 మీటర్లు పైగా లైను వేయాల్సి ఉంది. గతంలో అయితే దీనికి రూ.లక్షల్లో వ్యయం అయ్యేది. కొత్త ’ఏపీఆర్‌సీ’ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయడంతో విద్యుత్‌శాఖాధికారులు ఎటువంటి అదనపు రుసుం అడగకుండానే ఉచితంగా రెండు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ వేసి వారం రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.
విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతర సేవలు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ జారీ చేసిన రైట్స్ ఆఫ్ విద్యుత్ కన్స్యూమర్స్ రూల్స్ 2020కి అనుగుణంగా ఏపీఈఆర్‌సీ కొన్ని మార్పులు చేసింది. స్థిరమైన ఛార్జీలతో పాటు పారదర్శకంగా కొత్త కనెక్షన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడైనా కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోరే వినియోగదారులకు కిలోమీటరు దూరం వరకు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఇతరత్రా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వినియోగదారులపై భారం పూర్తిగా తొలగిపోయింది.
లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు
ఈవిధానంలో సర్వీసు చార్జీలు, విద్యుత్ స్తంభాల చార్జీలు, లైన్ విస్తరణ, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాట్ల చార్జీలను పూర్తిగా రద్దు చేశారు. వినియోగదారులు కేవలం తమకు అవసరమైన లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ కనెక్షన్ పొందడం సులభతరమైంది. జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి మంచి స్పందన వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 5 లక్షల 99 వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. కొత్తవిధానం ద్వారా నెలకు సగటున 500 వరకూ కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు విద్యుత్‌శాఖాధికారులు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధికి ఊతం
ఈవిధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం, చిన్న వ్యాపారాలు, గృహోపాధి యూనిట్లు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో సౌలభ్యం ఉంటుంది. విద్యుత్ సౌకర్యం వేగంగా అందుబాటులోకి వస్తుంది.
సులువుగా విద్యుత్ కనెక్షన్
ఎం.లక్ష్మణరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం
గతంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం మౌలిక వసతుల ఏర్పాటు భారం వినియోగదారులపై పడేది. ఏపీఆర్‌సీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆ పరిస్థితి మారింది. నగరాలు, పట్టణాలు లేదా గ్రామాల్లో ఎక్కడైనా కిలోమీటరు పరిధిలో కొత్త కనెక్షన్ అడిగితే స్తంభాలు వేయడం, లైన్లు లాగడం, అవసరమైతే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం వంటి పనులన్నీ విద్యుత్‌శాఖే సొంత నిధులతో పూర్తి చేస్తుంది. 15రోజుల్లోపే విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నాం. ఎక్కడైనా సిబ్బంది విద్యుత్ స్తంభాల పేరుతో అదనపు వసూళ్లుకు పాల్పడితే మా దృష్టికి తీసుకురావాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.