Share News

Electric Buses 2028 నాటికి ఎలక్ట్రికల్‌ బస్సులు

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:07 AM

Electric Buses by 2028 ప్రయాణికులకు 2028 నాటికి ఎలక్ట్రికల్‌ బస్సుల ద్వారా సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు.శనివారం పార్వతీపురం ఆర్టీసీ డిపోను సందర్శించారు.

 Electric Buses   2028 నాటికి  ఎలక్ట్రికల్‌ బస్సులు
అధికారులు, కార్మిక సంఘ నాయకులతో మాట్లాడుతున్న ఈడీ బ్రహ్మానందరెడ్డి

పార్వతీపురం టౌన్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు 2028 నాటికి ఎలక్ట్రికల్‌ బస్సుల ద్వారా సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు.శనివారం పార్వతీపురం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు సేవలందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. పార్వతీపురం, పాలకొండ డిపోల్లో బస్సుల కొరత వాస్తవమేనని, అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్ల కొరత కూడా వాస్తవమే, ఆ సమస్యను అఽధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాకు అదనంగా ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో, గ్యారేజీలో సమస్యలపై డీపీటీవో వెంకటేశ్వరరావును అడిగి తెలుసు కున్నారు. డ్రైవర్లు, కండక్టర్లపై పని భారం తగ్గించాలని, దీర్ఘకాలక సమస్యలను పరిష్కరించాలని ఈయూ జిల్లా అఽధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, పార్వతీపురం డిపో కార్యదర్శి కె.నర్సింగరావు తదితరులు ఈడీకి వినతిపత్రం అందజేశారు. బస్సుల సంఖ్యను పెంచాలని, డిపో కార్యాలయ, గ్యారేజీ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కొత్తగా టిక్కెట్లు కొట్టే టిమ్‌ మిషన్లు పంపిణి చేయాలన్నారు. ఈడీ వెంట పార్వతీపురం డిపో ఇన్‌చార్జి మేనేజర్‌ లక్ష్మణరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:07 AM