Share News

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - May 06 , 2025 | 12:26 AM

మండలంలోని భల్లకృష్ణరాయపురంలో సోమవారం ఉదయం బొత్స రమణమ్మ(75) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

సీతానగరం, మే 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భల్లకృష్ణరాయపురంలో సోమవారం ఉదయం బొత్స రమణమ్మ(75) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పార్వతీపురం రూరల్‌ సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం.. రమణమ్మ తన కుమార్తె లక్ష్మితో కలిసి ఇంట్లో నివాసం ఉంటోంది. అయితే ఆదివారం లక్ష్మి వేరేవారి ఇంటికి నిద్రించడానికి వెళ్లింది. రమణమ్మ ఆ రోజు ఒంటరిగానే ఇంట్లో నిద్రించింది. సోమవారం ఉదయం లక్ష్మి తన ఇంటికి వచ్చి తల్లి రమణమ్మను నిద్రలేపగా.. ఆమె మృతిచెంది ఉంది. దీంతో లక్ష్మి బోరున ఏడ్చింది. బీరువాలో బంగారు ఆభరణాలు, డబ్బులు మాయమైనట్టు గుర్తించింది. దీంతో తన ఇంట్లో దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగిలించి, తన తల్లిని హత్య చేసి ఉంటారని అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఇన్‌చార్జి ఎస్‌ఐ నీలకంఠం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్వ్కాడ్‌తో పరిశీలించారు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం కేంద్రా సుపత్రికి తరలించారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 06 , 2025 | 12:26 AM