Minister Lokesh’s Tour మంత్రి లోకేశ్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:42 PM
Elaborate Arrangements for Minister Lokesh’s Tour జిల్లాలో ఈనెల 9న మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. శనివారం పార్వతీపురంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరితో సమీక్షించారు.
అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్ష
పార్వతీపురం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 9న మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. శనివారం పార్వతీపురంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరితో సమీక్షించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ ‘షౌనింగ్ స్టార్స్’ పేరిట పురస్కారాలు అందించ నున్నారని ఆమె తెలిపారు. అనంతరం వారితో ముఖాముఖి నిర్వహించనున్నారని, ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉన్న రాయల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించి.. ఏర్పాట్లపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురంలో విద్యార్థులకు పురస్కారాల ప్రదానం తర్వాత చినబొండపల్లి సమీపంలో పార్టీ శ్రేణులతో సమావేశం ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మన్యం జిల్లాకు మంత్రి లోకేశ్ వస్తున్నందున పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకుని ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు స్వయంగా మంత్రి లోకేశ్ జిల్లాకు రావడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ విప్ జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ... మంత్రి లోకేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాలకు మించి ఉత్తమ ఫలితాలు సాధించిన మన్యం విద్యార్థులను ప్రశంసించడం కోసం ఆయన జిల్లాకు వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తారని తెలిపారు. వారి వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ఏఎస్పీ అంకిత సురాన, డీఆర్‌వో హేమలత, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, అమరావతి నుంచి వచ్చిన లోకేశ్ సభ వేదిక బృందం ప్రతినిఽధులు రవితేజ, శ్రీకాంత్ , యువగళం ప్రతినిధి కోలక రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు పార్వతీపురం మండలం చినబొండపల్లి ప్రాంతంలో సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల రాకపోకలతో పాటు ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సభా వేదికపైకి ఎవరెవరిని అనుమతించాలి తదితర అంశాలపై ఎస్పీతో చర్చించారు.